పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నువ్వున నచ్చరల్ గొలువ నుర్వికి వచ్చి ముహూర్తమాత్రలో
మవ్వపుటైహికక్రియలు మాని పరాపరతత్వవేదియై.[1]

310


తే.

వరుస బ్రహ్మాదులకునైన వశముగాని, సచ్చిదానందయోగవాసనలఁ బొదలి
యొకముహూర్తములో నృపాలకుఁడు మిగుల, విష్ణుసాయుజ్యమునఁ బొందె విస్మయముగ.

311


క.

ఆరాజు యోగవిద్యా, సారస్యముఁ జూచి మెచ్చి సప్తర్షులు రై
వారములు సేయుచుండుదు, రారయ నొక్కొక్కవేళ నలరుచుఁ దమలోన్.[2]

312


క.

ఏపున నొక్కముహూర్తము, లోపల గైకొనియె విష్ణులోకసుఖంబుల్
తాపసు లీఖట్వాంగది, లీపుని సరి గారు యోగలీలాప్రౌఢిన్.[3]

313


క.

అని యిట్లు నేటికాలముఁ, గొనియాడుదు రాదిలీపకువలయపతికిం
దనయుండు రఘునృపాలుఁడు, జనియించె నతిప్రతాపసంపద మెఱయన్.

314


ఉ.

ఆరఘుభూమిభర్తసుతుఁడై జనియించె నజుండు వానికిం
దోరపుకీర్తిచే దశరథుం డుదయించె నతండు వైరిదు
ర్వారపరాక్రమక్రమనివారణకారణమండలాగ్రుఁడై
ధారుణియెల్ల నేలె విదితంబుగ షష్టిసహస్రవర్షముల్.[4]

315

శ్రీరామచరిత్రము

క.

ఆదశరథేశునకు దా, మోదరుఁడు త్రిలోకరక్షణోద్యమలీలం
గాదె తనమూర్తి నాలుగు, భేదంబులుగా జనించెఁ బెం పేపారన్.[5]

316


క.

ఇల విష్ణుమూర్తివలనన్, నలువొందిన రామలక్ష్మణభరతశత్రు
ఘ్నులు బాహాబలదర్పో, జ్జ్వలులై విలసిల్లుచున్న వారలలోనన్.

317


ఉ.

భూచరఖేచరాభినుతపుణ్యుఁడు రాముఁడు శైశవంబునం
దేచిన తాటకన్ రణ మహిం బడనేసి సుబాహు నొక్కనా
రాచమునన్ వధించి ప్రమదంబున నంబుధిలోఁ బడంగ మా
రీచుని నొంచి కౌశికు వరించిన యజ్ఞముఁ గాచెఁ బెంపుతోన్.[6]

318
  1. ఉవ్వునన్ = తటాలున, మవ్వపు = మనోజ్ఞమైన.
  2. సారస్యము = సరసత్వము, కైవారములు = స్తోత్రములు.
  3. ఏపునన్ = ఉత్సాహముతో.
  4. వైరి...మండలాగ్రుఁడు = శత్రువులయొక్క అడ్డగింపరాని పరాక్రమమర్యాదను పోఁగొట్టుటకు హేతువైన ఖడ్గము గలవాఁడు - అణఁపరానిశత్రువుల పరాక్రమమును ఆణఁచినవాఁ డనుట.
  5. పెంపు = గౌరవము.
  6. భూచరఖేచరాభినుతపుణ్యుఁడు = భూమియందు సంచరించునట్టి మనుష్యులచేత ఆకాశమున సంచరించునట్టి దేవతలచేతను కొనియాడఁబడిన ధర్మముగలవాఁడు, శైశవంబునందున్ = శిశుత్వమునందు - పసితనమునందే, ఏచిన = చెలరేగిన, నొంచి = నొప్పించి.