పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

ఇమ్ముల భూమియంతయును నేలుచు నాత్మవధూటితోడి సౌ
ఖ్యమ్ములు గోరియున్న మదయంతియుఁ దొల్లిటి విప్రకాంతశా
ప మ్మెఱిఁగించి నీకు నిది ప్రాణభయం బగునన్న నాత్మలో
నుమ్మలికించుచున్ సతుల నొల్లకయుండెను షండుకైవడిన్.[1]

300


వ.

ఇట్లు స్త్రీసంగమపరాఙ్ముఖుండై పెద్దకాలంబు రాజ్యంబు చేసి సంతానార్థంబుగా
వసిష్ఠుఁ బ్రార్థించి తన భార్య యైనమదయంతిని సమర్పించిన నమ్మునీంద్రుం
డయ్యింతికి గర్భాధానంబు చేసి బలపరాక్రమసంపన్నుం డైన కుమారుండు
జన్మించు నని చెప్పి చనియె నంత.

301


ఆ.

అధిపుకాంత గర్భమై యేడుసంవత్స, రంబు లుండి పుత్రరత్న ముద్భ
వింపకున్నఁ జాల వేసఱి భరియింప, లేక యొక్కనాఁడు భీకరముగ.

302


తే.

అశ్మమునఁ దనగర్భ మయ్యంబుజాక్షి, పొడిచికొనుటయు జన్మించెఁ బుత్రకుండు
వాని కశ్మకుఁ డనునభిధాన మర్థిఁ, జేసి నవయౌవనంబునఁ జెలఁగుటయును.[2]

303


క.

ఆకల్మాషపదుం డ, స్తోకముదముతోడఁ దనదుసుతు నశ్మకునిన్
సాకేతరాజ్యవిభవము, చేకొన నియమించి తపము సేయంబోయెన్.

304


క.

ఆయశ్మకుండు రాజై, యాయతముగ భూమి యేలె నాతనికి సుతుం
డై యుదయించెను మూలకుఁ, డాయవనిపుఁ డుర్వి యేలె నాకాలమునన్.

305


ఉ.

రాజుల నందఱం బరశురాముఁడు ద్రుంచెడునాఁడు వాఁడు ఘో
రాజి నెదుర్కొనన్ వెఱచి ప్రాణభయంబున నగ్నవేషకాం
తాజనకోటిలో నొదిఁగినన్ వనితాసముఁ డంచుఁ గాచి యా
రాజులవైరి వోయె సమరంబున నన్యనృపాలహింసకున్.

306


వ.

ఇట్లు నారీజనరక్షితుం డగుటంజేసి యామూలకుండు నారీకవచుం డనం బరఁగె
నట్టినారీజనకవచునకు నిలబిలుండును వానికి ఖట్వాంగదిలీపుండునుం బుట్టిరి.
అద్దిలీవుండు రాజ్యంబు చేయుసమయంబున.

307


మ.

చల మొప్పారఁగ దేవదానవులకున్ సంగ్రామరంగంబు వా
టిలినన్ దేవగణంబు లయ్యసురకోటిన్ మార్కొనలేక
భీతిలి ఖట్వాంగదిలీపభూమిపతి నర్థిం దెచ్చి విద్వేషులం
గలనం జంపి జయంబు చేకొని భుజాగర్వంబు లేపారఁగన్.[3]

308


ఆ.

ఉన్నయవసరమున మన్నించి వేల్పులు, వరము వేఁడుమనిన వసుమతీశుఁ
డట్లయేని నాకు నాయుఃప్రమాణ మెం, తనిన రెండుగడియ లనిరి సురలు.

309


ఉ.

నవ్వి మహీశుఁ డాసురగణంబులఁ గన్గొని యట్లయేని నే
నవ్వర మొల్ల న న్ననుపుఁ డంచుఁ బసిండివిమాన మెక్కి కా

  1. ఉమ్మలికించుచున్ = విచారపడుచు.
  2. అశ్మమునన్ = రాతితో.
  3. కలనన్ = యుద్ధరంగమునందు, ఏపారఁగన్ = అతిశయింపఁగా.