పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కల్మాషత్వంబున నుపగతంబయ్యె నట్టికారణంబున నారాజు కల్మాషపాదుండయ్యె
నంత.[1]

289


ఉ.

అమ్ముని శాపదోషమున నాసురవృత్తి నతండు రాత్రికా
లములయందుఁ బేరడవులన్ నరులన్ వధియించి మాంసముల్
సమ్మతిమై భుజించి దివసంబుల మానుషభంగి నుండు ని
ట్లమ్మనుజేంద్రచంద్రుని భయంకరవేషముఁ జెప్పఁ జిత్రమా.[2]

290


సీ.

ఇవ్విధంబున నన్నరేంద్రుండు రాక్షసాకారంబుతోడ నక్కాననముల
నొంటిమైఁ దిరుగుచు నున్నకాలంబునం దొకనాఁడు బ్రాహ్మణుం డొక్కరుండు
ఋతుమతి యైనట్టి సతితోడ సుఖకేళి గావించుచున్న యక్కాల మెఱిఁగి
పటువేగమున వానిఁ బట్టి వధింపంగఁ బఱతెంచుకల్మాషపాదుఁ జూచి


తే.

భయముతోడ వెఱచి పఱచుచునుండ నా, రక్కసుండు విప్రు నుక్కణంగఁ
బట్టుకొనిన నతనిభార్య శోకించుచు, నతనికడకు వచ్చి యర్థిఁ బలికె.[3]

291


క.

లోకస్తుతమిత్రసఖా, ఖ్యాకుఁడవు మహాత్ముఁడవు దయామూర్తివి యి
క్ష్వాకుకులాధారుండవు, నీ కేటికి విప్రుఁ జంపి నెత్తురు ద్రావన్.[4]

292


వ.

నీవు ధర్మసుఖాభిజ్ఞుండవు గావున నీ వెఱుంగనిధర్మంబు లేమి గలవు నేను
ప్రాణవల్లభునివలన సురతసుఖంబులఁ దృప్తింబొందక యున్నదానఁ గావున
నాకుం బతిదానంబు సేయుము బ్రాహ్మణహత్య మహాపాతకం బిట్టి నీచకర్మం
బులు ధర్మంబులు గావని పెక్కువిధంబులం బ్రార్థించుచుండ నప్పాపాత్ముండు.

293


క.

పులి పసరముఁ జంపినగతి, బలువిడి బ్రాహ్మణునిఁ జంపి భక్షించిన యా
తులువం గనుఁగొని బ్రాహ్మణు, కులసతి నిలువం రాని కోపవశమునన్.

294


తే.

నిర్దయాత్మక నాపతి నిరపరాధి, జంపితివి గాన నీవును సతులతోడి
సంగతికిఁ బోయినప్పుడ చత్తు వనుచు, శాప మిచ్చి యగ్నిప్రవేశంబు చేసె.

295


వ.

ఇవ్విధంబున నారాజు చేసిన యన్యాయంబునకు సకలభూతంబులును హాహాకా
రంబుల నాక్రోశించె నప్పుడు.

296


క.

మునివరుశాపంబున న, జ్జననాథుఁడు పదియు రెండు సంవత్సరముల్
దనుజుండై దుష్కర్మము, లొనరించె జగంబు లెల్ల నోహో యనఁగన్.

297


క.

ఘను లైనవసిష్ఠమహా, మునిముఖ్యులు వచ్చి నృపతిమొక్కలమునఁ జే
సినపాతకములు శాంతిగ, ఘనయజ్ఞముఁ జేసి సుకృతిఁ గావించి రొగిన్.[5]

298


వ.

ఇట్లు నిష్కల్మషుండైన కల్మాషపాదుండు.

299
  1. ఆత్మీయకోపానలాశ్రితంబులు = తనకోపమనెడు నిప్పును ఆశ్రయించినవి - కోపాగ్నిచే వేఁడిమి నొందినవి, దగ్ధచ్ఛాయయై = కాలినవర్ణము గలవి కాఁగా, కల్మాషత్వంబున్ = చిత్రవర్ణత్వమును, ఉపగతంబు = పొందఁబడినది.
  2. దివసంబులన్ = పగటివేళలయందు.
  3. పటువేగమునన్ = మిక్కిలి వడిగా, ఉక్కణంగన్ = చిక్క.
  4. మిత్రసఖాఖ్యాకుఁడవు = మిత్రసఖుఁ డనుపేరు గలవాఁడవు.
  5. మొక్కలమునన్ = ముష్కరత్వముచేత.