పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఇ ట్లనతిదూరంబున శరత్కాలదివాకరుండునుంబోలె ననవరతతేజోవిభాసి
తుండై యశేషదిశాసముద్యోతమానుం డగునమ్మునీంద్రు నాశ్రమంబునం గట్టి
యున్న యధ్వరాశ్వంబుఁ బొడగని సముద్యతాయుధహస్తులై యతనిం
బరివేష్టించి.[1]

259


క.

మనతండ్రి యధ్వరాశ్వముఁ, గొనివచ్చిన దొంగ వీఁడె గుఱ్ఱముతోడం
జనఁ జోటులేక నిక్కపు, మునిగతి నున్నాఁడు వీని మోఁదఁగవలయున్.

260


ఉత్సాహము.

అనుచు బెట్టిదంబులాడునవనినాథసూనులం
గినిసి మౌనిముఖ్యుఁ డగ్నికీల గ్రమ్ముచుండు లో
చనకటాక్షవీక్షణములఁ జలనవృత్తిఁ జూచినన్
దనువులందు నగ్ని పొదువ దగ్గమైరి వారొగిన్.[2]

261


తే.

ఇవ్విధంబునఁ గపిలమునీంద్రుకోప, పావకముచేతఁ బుత్రులు భస్మమైన
వార్త సగరుండు విని శోకవార్ధి మునిఁగి, యధ్వరాశ్వంబుఁ గొనితేర నంశుమంతు.

262


వ.

పనిచిన నయ్యసమంజసపుత్రుండు నరిగి.

263


ఆ.

సగరసుతులు మున్ను చనినమార్గమునంద, యరిగి కపిలమౌని నర్థిఁ గాంచి
పరమభక్తితోడఁ బ్రణమిల్లి కరములు, మొగిచి పెక్కుచందముల నుతింప.

264


క.

కపిలుఁడు ప్రసన్నమతియై, నృపనందనుఁ జూచి పుత్ర నీ కీహయమున్
గృపతో నిచ్చితిఁ గొనిపో, యి పితామహునశ్వమేధ మీడేర్పు మొగిన్.

265


వ.

అనిన నంశుమంతుండు కృపాయత్తచిత్తుం డైనయమ్మునీంద్రునకుఁ గృతాంజలియై
దేవా బ్రహ్మదండోపహతు లైనమత్పితృవర్గంబులకు స్వర్గప్రాప్తికరం బైనవరంబు
బ్రసాదింపవలయు ననిన నతం డిట్లనియె.

266


శా.

నీపౌత్రుండు భగీరథుం డతితపోనిష్ఠాపరుండై త్రిలో
కీపూతం బగు వేల్పుటే ఱిలఁ జెలంగించుం దదీయాంబువుల్
పై పైఁ బర్వగ నస్థిభస్మనికరప్లావం బగున్ నీపితృ
క్ష్మాపలావళి కంతటం గలుగు శశ్వత్స్వర్గసౌభ్యోన్నతుల్.[3]

267


ఉ.

పూని ముకుందుపాదమునఁ బుట్టి జగత్పరిపూత యైనగం

  1. అశేషదిశాసముద్యోతమానుఁడు = ఎల్లదిక్కులను ప్రకాశింపఁజేయుచున్నవాఁడు, సముద్యతాయుధహస్తులు = ఎత్తఁబడిన ఆయుధములు చేతులందుఁ గలవారు.
  2. బెట్టిదంబులు = పరుషవాక్యములు.
  3. త్రిలోకీపూతంబు = మూఁడులోకములను పావనములనుగాఁ జేయునది, వేల్పుటేఱు = దేవగంగ, చెలంగించున్ = ప్రవహింపఁజేయును, ప్లావంబు = తడియుట, శశ్వత్స్వర్గసౌఖ్యోన్నతులు = మేలైన స్వర్గసుఖముయొక్క ఘనతలు.