పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అసమంజసచరితుం డగు, నసమంజను నట్ల తమ్ము లందఱు నతిపా
పసమన్వితమానసులై, వసుమతిఁ గలగుండు పెట్టి వర్తించి రొగిన్.[1]

248


క.

యాగములు చెఱిచి తపములు, సాగంగా నీ కసాధుజనమార్గపరి
త్యాగక్రియ లొనరించిన, సాగరులం జూచి సుర లసహ్యాత్మకులై.[2]

249


తే.

సకలవిద్యామయుండును సంహృతాఖి, లాఘుఁడును భగవంతుఁడు నంబుజేక్ష
ణాంశసంభూతుఁడును నైనయట్టి కపిల, సంయమీశ్వరుకడ కేగి శరణు సొచ్చి.[3]

250


ఆ.

ధర్మహీనులై యధర్మోపలక్షణ, దారుణక్రియావిహారులైన
సగరసుతులదుష్టచరితంబు లేర్పడ, విన్నవించి మఱియు విబుధవరులు.[4]

251


ఆ.

దుష్టశిక్షణమును శిష్టరక్షణమును, నర్థిఁ జేయఁబూని యవనియందు
నవతరించినట్టి హరిమూర్తి వగుట నీ, కెఱుఁగఁజెప్పవలసె నింతవట్టు.[5]

252


వ.

ఇద్దురాత్ముల చేత జగంబు లేమి గాఁగలవోకో యనినఁ గపిలమహాముని దేవ
తల కిట్లనియె.

253


తే.

పాపకర్ములై యొరుల కుపద్రవములు, సేయువారల దైవంబు చెఱుచుఁ గాన
వారి నెవ్వరుఁ జెఱుపంగవలదు దమకు, హానివృద్ధులు పాపపుణ్యములఁ గలుగు.

254


వ.

కావున నల్పకాలంబున సగరసుతులు దముందార వినాశంబై పోవంగలవారు
మీరు పొండని యమ్మునీంద్రుండు తపంబు సేయుచుండె నంత.[6]

255


ఆ.

సగరుఁ డశ్వమేధసవనంబు గావింప, దీక్షఁ బూని యశ్వరక్షణార్థ
మాత్మసుతులఁ బనుప నఱువదివేవురు, నాతురంగమంబు నరయునపుడు.

256


చ.

అనిమిషదూత యొక్కఁడు రయంబున నానరనాథసూనులన్
గను మొఱిఁగించి యజ్ఞతురగంబును భూమిబిలంబులోనికిం
గొని చని నాగలోకమున ఘోరతపం బొనరించుచున్న స
జ్జననుతమూర్తి యాకపిలసంయమియాశ్రమభూమిఁ గట్టినన్.[7]

257


చ.

తురగముఁ గాన కానృపసుతుల్ పటుబాహుబలప్రతాపులై
యురుతరశక్తితో నవని నొక్కొకఁ డొక్కొకయోజనాయతం
బురవడిఁ ద్రవ్వి కానక మహోగ్రతఁ బన్నగలోకమంతయుం
దిరుగుచు నచ్చటం గనిరి దివ్యమునిం గపిలున్ మహాత్మునిన్.

258
  1. అసమంజసచరితుఁడు = చెడ్డనడవడి కలవాఁడు, కలగుండు పెట్టి = కలఁత పెట్టి.
  2. అపహ్యాత్మకులు = ఓర్వలేనిమనసు గలవారు.
  3. సంహృతాఖిలాఘుఁడు = సంహరింపఁబడిన యెల్లపాపములు గలవాఁడు - ఎల్లపాపములను తొలఁగించినవాఁడు, భగవంతుఁడు = షడ్గుణైశ్వర్యసంపన్నుఁడు.
  4. అధర్మోపలక్షణదారుణక్రియావిహారులు = అధర్మమును సూచించునట్టి భయంకరమైన పనులయందు వినోదముగా తిరుగువారు.
  5. ఇంతవట్టు = ఇదంతయు.
  6. తముందార = తమంతటఁ దామే.
  7. కను మొఱఁగించి = ఏమఱించి - ఇది యపూర్వప్రయోగము.