పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

నీ వింక వీరిఁ జంపకు, భూవల్లభ నీప్రతిజ్ఞ భూయిష్ఠముగా
జీవన్మృతులం జేసితి, నీవసుధేశ్వరులనెల్ల నిది యెట్లనినన్.[1]

240


క.

ధారుణిఁ దమతమవంశా, చారంబులు విడుచు టెల్లఁ జచ్చుట కాదే
వైరుల జీవన్మృతు లగు, వారల నెవ్వారుఁ జంపవలదు నరేంద్రా.

241


వ.

అదియునుంగాక ప్రాణభయార్తులై శరణుచొచ్చినవారిని రక్షించుటకంటెఁ బర
మధర్మంబు లేదు. విశేషించి మద్వచనంబు లంఘనీయంబు గాదు గావున వీరియందు
బ్రతిజ్ఞాభంగంబున నైనదోషంబు లేదు వీరియందుఁ గోపోపశమంబు సేయుమనిన
గురువచనంబు లభినందించి యారాజులం గాచి విడిచె నాటనుండియు యవను
లు ముండితోత్తమాంగులును శకు లర్ధముండితులును పారదులు ప్రలంబకేశులును
ప్లవులు శ్మశ్రుధరులును కాంభోజు లస్వాధ్యాయపరులును నై నిజకులాచారపరి
త్యాగంబు చేసి బ్రాహ్మణులచేత విడువంబడి మ్లేచ్ఛు లై రివ్విధంబున సగరుండు
విజయసంపన్నుండై స్వాధిష్ఠానంబునకు వచ్చి రాజ్యాభిషిక్తుండై సప్తద్వీపసమేతం
బుగా మహీమండలంబుఁ బరిపాలించుచుండి.[2]

242


తే.

వినతకును గశ్యపునకును దనయయైన, సుమతియు విదరరాజన్యసుత సుకేశి
యిరువురును భార్యలై రమణీయసురత, సుఖవినోదంబు లొనరింప క్షోణి యేలె.

243


క.

అంతట నాసగరమహీ, కాంతుఁడు పుత్రార్థియై వికాసప్రీతిం
గాంతలు దానును నౌర్వు ని, రంతరమును సేవ చేసి యారాధింపన్.

244


క.

ఒకసతికి వంశవర్ధను, నొకతనయుని నిత్తు నొకపయోరుహసమనే
త్రకు నఱువదివేవురుపు, త్రకుల నొసఁగువాఁడ ననుచు దాపసి పలికెన్.

245


క.

పలికిన విదర్భనందన, కులదీపకు నొక్కసుతునిఁ గోరుకొనియె ని
మ్ముల నఱువదివేవురు తన, యులఁ గాశ్యపి కోరె మునియు నొసఁగెం బ్రీతిన్.

246


వ.

ఇవ్విధంబున నౌర్వుప్రసాదంబునం జేసి కతిపయకాలంబునకు సుకేశికి నసమంజ
సుఁ డనుకుమారుం డొక్కరుండును సుమతికి నఱువదివేవురుకుమారులు జ
న్మించి పెరుగుచుండ నసమంజసుండు బాల్యంబుననుండియుఁ బాపకర్మపరుండై
తమ్ములుం దానును సాధుజనంబుల బాధించుచుండఁ దండ్రికి నసహ్యంబయ్యును
భావికాలంబున బుద్ధిమంతుం డగునో యనునాసం జేసి సంప్రాప్తయౌవనుం డగునం
తకుం బెనిచిన నతఁ డంతకంతకు దుర్గుణంబులు విడువక వర్తించుచున్న నయ్య
సమంజసునకు వంశుమంతుం డనుకుమారుండు జన్మింపఁ బౌత్రపరిగ్రహంబుఁ జేసి
పాపాత్ముం డైనకుమారుని వెడలనడిచిన.[3]

247
  1. భూయిష్ఠము = అంతట వ్యాపించినది.
  2. లంఘనీయంబు = దాఁటఁదగినది, అభినందించి = కొనియాడి - ఆదరించి యనుట, అర్ధముండితులు = సగము గొఱుగఁబడినవారు, ప్రలంబకేశులు = మిక్కిలి వ్రేలుచున్న తలవెండ్రుకలు గలవారు, శ్మశ్రుధరులు = గడ్డము మీసమును ధరించినవారు, స్వాధిష్ఠానంబునకున్ = తనయునికిపట్టునకు.
  3. కతిపయకాలంబునకు = కొంతకాలమునకు, అసహ్యంబు = సహించరానిది, భావికాలంబుల్ = రాఁగలకాలమున.