పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అంత నతీతానాగతవర్తమానకాలత్రయవిజ్ఞానవిద్యాఖర్వుం డైనయౌర్వుండు
నిజాశ్రమంబు వెలువడివచ్చి యయ్యంబుజాక్షి నగ్నిప్రవేశంబు చేయకుండ
నివారించి యిట్లనియె.[1]

229


క.

సుదతీ యేటికి సొద సొ, చ్చెదు నీయుదరంబులోనిశిశువు విరోధి
ప్రదముఁడు వీర్యపరాక్రముఁ, డుదితార్కసమానుఁ డుర్వి యొక్కడ యేలున్.[2]

230


తే.

సకలయజ్ఞంబులును జేసి చక్రవర్తి, యై యనేకకుమారులు నర్థిఁ గాంచి
వంశకరుఁ డగుఁ గావున వలదు నీకు, నింతసాహస మన్న నయ్యిందువదన.

231


క.

మరణంబు మాని పతికిం, బరలోకక్రియలు సేసి పరమానందో
త్కరమతితో నమ్మౌనీ, శ్వరునాశ్రమభూమియందు వర్తించుతఱిన్.

232


క.

కతిపయదినములలో న, య్యతివ గరముతోడఁగూడ నాత్మజుఁ గనినన్
ధృతి నౌర్వుఁడు సగరుండని, యతనికి నామంబు చేసె నర్హస్థితితోన్.

233


వ.

జాతకర్మాదిక్రియలు నిర్వర్తించి పెంచి చౌలోపనయనాదికృత్యంబు లుదాత్తం
బులుగా నడపి వేదశాస్త్రపురాణంబులం బ్రవీణుంజేసి యనేకశాస్త్రశిక్షాదక్ష
విద్యలు దెలిపి రథాశ్వగజారోహణాదు లైనరాజవర్తనంబుల నేకొఱంతయు
లేకుండ శిక్షించె. ఇట్లు కృతకృత్యుండై సగరుండు జననికడకుం జనుదెంచి
యొక్కనాఁ డిట్లనియె.[3]

234


క.

జననీ యడవుల నుండఁగ, మన కేటికి నెందుఁ బోయె మజ్జనకుఁడు నా
విని తల్లి పుత్రుతోడను, మునుకొని కన్నీరు దొరుఁగ మొగి నిట్లనియెన్.

235


క.

తనయా యేమని చెప్పుదు, ననిలోపల హైహయాదు లగురాజులు మీ
జనకుని గెలిచి సమస్తముఁ, గొని పాఱఃగఁ దోలి రిట్టి ఘోరాటవికిన్.

236


వ.

అని పలికి సవతి తనకు గర్భస్తంభం బగునట్లుగా విషంబుఁ బెట్టుటయును వార్ధకం
బున రాజు పరలోకగతుం డగుటయు నౌర్వుప్రసాదంబునఁ దమకు సకలరాజ్యం
బును దొల్లింటియట్ల యనుభవింపగలుగుటయునుం జెప్పినఁ గోపించి.

237


చ.

మదమునఁ దండ్రిరాజ్యము సమస్తముఁ గొన్న విరోధివర్గమున్
గదనములోనఁ జంపి త్రిజగంబునఁ గీర్తి వెలుంగునట్లు చే
నెద ననుచుం బ్రతిజ్ఞ దగఁ జేకొని హైహయవంశరాజులం
బొదివి నిశాతఘోరశరపుంజముల న్వధియింప బల్విడిన్.[4]

238


వ.

అంత శకయవనకాంభోజపారదప్లవాదిదేశంబులరాజులు ప్రాణభయార్తులై
తత్కులగురుం డైనవసిష్ఠు శరణు చొచ్చిన నమ్మునీంద్రుండు వారల నిజకులాచార
ధర్మంబులు విడిపించి జీవన్మృతులం జేసి సగరున కిట్లనియె.[5]

239
  1. అఖర్వుఁడు = గొప్పవాఁడు.
  2. ప్రదముఁడు = లెన్సగా ఆణఁగఁగొట్టువాఁడు.
  3. ఉదాత్తంబులుగాన్ = ఘనములుగా.
  4. పొదివి = ఆక్రమించి, నిశాతఘోరశరపుంజములన్ = చురుకుగల భయంకరములైన బాణసమూహములచేత, బల్విడి = అతిశౌర్యముతో.
  5. జీవన్మృతులన్ = బ్రతికియు చచ్చినవారినిఁగా.