పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ధరణిఁ బండ్రెండువత్సరము లనావృష్టియై మహాదుర్భిక్షమైన నాత్రి
శంకుండు వచ్చి విశ్వామిత్రుపుత్రమిత్రకళత్రములకు నిత్యంబు నడవి
మృగమాంసములు దెచ్చి మెఱసి చండాలప్రతిగ్రహమునకు ననుగ్రహింపఁ
డో యని కొంకి తా నొరు లెఱుంగకయుండ జాహ్నవిదరిఁ దదాశ్రమసమీప


తే.

వటమహీరుహశాఖ నావటము గాఁగఁ, గట్టఁ గౌశికుఁ డందుచేఁ గఱవు దీర్చి
వసుమతీనాథుఁ బరమపావనునిఁ జేసి, బొందితోడ నమరపురంబునకు ననిచె.[1]

220


వ.

అట్టి త్రిశంకునకు హరిశ్చంద్రుండు పుట్టె.

221


సీ.

సకలసంపదలు విశ్వామిత్రునకు నిచ్చి సత్యవ్రతంబు శాశ్వతము చేసె
బాహుగర్వమున సప్తద్వీపములఁ దనయాజ్ఞ చెల్లంగ రాజ్యంబు సేసె
నవ్యాహతైశ్వర్యుఁడై పెక్కువేలేండ్లు హరిమూర్తిఁ దాల్చి విఖ్యాతిఁ గాంచె
నర్థితో రాజసూయాశ్వమేధాదిమహాధ్వరంబులు పెక్కు లాచరించె


తే.

నంతమున దేవలోకంబునందు నింద్రు, సరస సింహాసనంబున బెరసియుండె
నిఖిలమున ధర్మమార్గంబు నించి మించె, సాంద్రయశుఁడు హరిశ్చంద్రచక్రవర్తి.[2]

222


వ.

అట్టి హరిశ్చంద్రునకు లోహితాశ్వుండును వానికి హరితుండును వానికిఁ జం
చుండును నతనికి విజయవసుదేవు లన నిరువురును బుట్టి రందు విజయునకు
రురుండును రురునకు వృకుండును వృకునకు బాహుండునుం బుట్టిరి.

223


క.

బాహుళ్యమహిమతో న, బ్బాహుఁ డయోధ్యాపురంబుఁ బాలింపంగా
హైహయులు మొదలుగా నృపు, లాహవమున నతనిరాజ్యమంతయుఁ గొనినన్.

224


క.

ఆనృపతి నిండుగర్భిణి, యైనమహిషితోడ నౌర్వునాశ్రమమునకు
దీనతఁ జనియుండఁగ, నమ్మానినికి సపత్నియైన మగువ కడంకన్.

225


క.

అర్భకుఁడు దనకుఁ గలుగని, నిర్భాగ్యత్వంబు దెలియనేరక కినుకన్
గర్భస్తంభంబుగ నా, గర్భిణికిన్ విషముఁ బెట్టెఁ క్రౌర్యముతోడన్.[3]

226


వ.

ఇట్లు గర్భస్తంభంబై యేడుసంవత్సరంబు లుండునంత బాహుండు వయో
వృద్ధుండు గావున పరలోకగతుండయ్యె.

227

సగరునిచరిత్రము

క.

మృతుఁ డైనప్రాణవల్లభుఁ, జితిపై నిడి యగ్రమహిషి చిత్తములోనన్
ధృతి దళుకొత్తఁగఁ దానును, బతితో ననలంబుఁ జొరఁగఁ బయనం బయ్యెన్.[4]

228
  1. కొంకి = సంకోచించి, అవటము గాఁగన్ =అనుకూలముగా.
  2. ఆవ్యాహతైశ్వర్యుఁడు = కొంచెమేనియు కొఱతలేని యైశ్వర్యము కలవాఁడు, సరసన్ = వెంబడి, బెరసి = పొంది.
  3. గర్భస్తంభంబుగన్ = గర్భము నిలఁబడిపోవునట్లు.
  4. తళుకొత్తఁగన్ = ప్రకాశింపఁగా - కలుగఁగా ననుట.