పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

పురుకుత్సుఁ డోపుననుచును, హరి యానతి యిచ్చె మాకు నటుగాన సుధా
కరపుత్రి నీవు చని యా, నరనాథునిఁ దెచ్చి కావు నాగకులంబున్.[1]

209


వ.

నీవు మాకు నియ్యుపకారంబు సేయు మిట్లయిన నీకుఁ బ్రత్యుపకారంబు సేయు
వార మని ప్రార్థించిన నొడంబడి నర్మదానది భూలోకంబునకు వచ్చి మాంధాత
పుత్రుం బొడగాంచి భుజంగభయాపనయార్థంబుగా నిష్టోపభోగంబులం దనుపు
నట్లుగా నియ్యకొని రసాతలంబునకుఁ దోడి తెచ్చిన.[2]

210


క.

భుజగేశ్వరులు ధరిత్రీ, భుజునిం బూజించి కదనమున గంధర్వ
ప్రజలను మర్దింపు మధో, క్షజుపలుకులు నిట్టివనుచు సమకట్టుటయున్.[3]

211


మ.

హరితేజోవిమలప్రతాపములచే నాప్యాయితుండై మహీ
శ్వరచూడామణి సంగరాంగణమునన్ షట్కోటిగంధర్వులన్
వరవజ్రప్రతిమానదారుణశరవ్రాతంబులం ద్రుంచి ని
ర్భరసంతోషము చేసెఁ బన్నగులకుం బాతాళలోకంబునన్.[4]

212


వ.

ఇవ్విధంబున రసాతలలోకంబునకు నిరాతంకంబు చేసి పన్నగేంద్రులవలన నిజకు
లాభివృద్ధి యగునట్లుగా వరంబు వడసి నిజపురంబునకు వచ్చి సుఖంబుండె నంత.[5]

213


క.

తమకెల్లను గడునుపకా, రము చేసిననర్మదకు వరం బొసఁగ భుజం
గమపరులందఱు నానదిఁ, బ్రమదంబునఁ బూజ చేసి పలికిరి దయతోన్.

214


తే.

అంబ నీదివ్యనామధేయముఁ జతుర్థి, నమరఁజేసి నమఃపదాంతముగ నుభయ
సంధ్యలందును దప్పక స్మరణసేయు, నతని కెన్నఁడు విష మెక్క దహులవలన.[6]

215


వ.

మఱియు నీదివ్యనామోచ్చారణంబు చేసినవారలకు భోజనసమయంబున విషంబు
భుజియించిన నమృతం బగునని వరం బొసంగిన నొడంబడి నర్మదానది పురుకుత్సు
కడకుంబోయి యతనియందు బద్ధానురాగయై యతని వరియించిన.

216


క.

పురుకుత్సునకును రేవకుఁ, దరణిప్రతిమానుఁ డగుచు ద్రసదస్యుఁ డనన్
వరసుతుఁడు పుట్టె నతనికి, హరివిక్రముఁ డుదయమయ్యె ననరణ్యుఁ డనన్.

217


క.

ఆయనరణ్యుఁడు జన్నము, సేయంగా రావణుం డశేషబలాఢ్యుం
డై యేగుదెంచి దుర్జయుఁ, డై యజ్ఞముఁ జెఱిచి యతనియసువులు గొనియెన్.[7]

218


వ.

అయ్యనరణ్యునకు హర్యక్షుండును హర్యక్షునకు వసుమనుండును వానికిం
బ్రియారణుండును నతనికి సత్యవ్రతుండునుం బుట్టిరి. ఆసత్యవ్రతుండు త్రిశం
కునామంబున వసిష్ఠుశాపంబునఁ జండాలుండై యుండె నక్కాలంబున.

219
  1. సుధాకరపుత్రి = ఓ చంద్రునికూఁతురా.
  2. భుజంగభయాపనయార్థంబు = పాములభయమును పోఁగొట్టుటకొఱకు.
  3. ధరిత్రీభుజునిన్ = రాజును, కదనమునన్ = యుద్ధమునందు.
  4. ఆప్యాయితుఁడు = ఊరడింపఁబడినవాఁడు, చూడామణి = శిఖామణి - శ్రేష్ఠుఁడు, ప్రతిమాన = సమానమైన, నిర్భర = మిక్కిలి యధికమైన.
  5. నిరాతంకంబు = నిర్భయము.
  6. చతుర్థిన్ = చతుర్థీవిభక్తితో.
  7. అసువులు = ప్రాణములు.