పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కాలంకారుని శంఖచక్రధరు నుద్యద్భానుకోటిప్రభా
జాలోదంచితదివ్యతేజు నసకృత్సౌభాగ్యలక్ష్మీయుతున్.[1]

200


క.

పరివేష్టించి సముచ్ఛ, స్వరముల గాంధర్వగానసముపేతముగాఁ
బొరిఁ బొరి బొగడిన లక్ష్మీ, శ్వరుఁడు నిదుర మేలుకొని ప్రసన్నుండయ్యెన్.[2]

201


వ.

ఇట్లు యోగనిద్రాప్రబుద్ధుం డైనయద్దేవదేవునకు దండప్రణామంబులు సేసి
గంధర్వులచేతఁ దమకు నైనబన్నంబులు విన్నవించిన మన్నించి వెన్నుండు పన్న
గేంద్రుల కిట్లనియె.[3]

202


క.

ధరఁ జక్రవర్తి యగు నా, పురుకుత్సుఁడు నామహత్త్వమున నున్నాఁ డా
ధరణీశుఁడు గంధర్వులఁ, బరిమార్పఁగ నోపు నతనిఁ బ్రార్థింపుఁ డొగిన్.

203


క.

అని యానతిచ్చి వీడ్కొలి, పినఁ బన్నగముఖ్యు లెల్లఁ బీతాంబరుచె
ప్పినయట్ల నాగలోకం, బునకు మగిడివచ్చి యొక్కప్రొవై తమలోన్.[4]

204


తే.

కార్యచింత యెఱింగి యిక్ష్వాకువంశ, సంభవుం డైనపురుకుత్సచక్రవర్తి
పాలి కెవ్వరిఁ బనుపంగఁ బాడియెుక్కొ, యని విచారించుచున్న యయ్యవసరమున.[5]

205


క.

మునియొకఁడు వచ్చి భుజగులఁ, గనుఁగొని మీతలఁచినట్టికార్యము సంఘ
ట్టన సేయఁదగినవారల, వినిపించెద మీరు వోయి వేఁడుకొనుఁ డొగిన్.[6]

206


వ.

పురుకుత్పుండు నర్మదానదియందు బద్ధానురాగుండై యున్నవాఁ డన్నదియు
నంతకంటె నతనియందుఁ బ్రియంబు గలిగియున్నయది మీర లాసోమపుత్రిం
బ్రార్థించి పంపిన నారాజన్యుండు వచ్చి మీపగ సాధింప నోపునని నిర్దేశించి పోయె
నప్పుడు.[7]

207


శా.

ఆరేవానది దైవయోగమునఁ దా నచ్చోటికికిన్ దేవతా
నారీరూపముతోడ వచ్చిన నహీంద్రశ్రేణి యేతెంచి య
త్యారూఢప్రియభాషలం దనిపి యయ్యాసన్నగంధర్వుల
బోరం జంపి భుజంగనాథులకుఁ బెంపున్ సొంపుఁ గావింపఁగన్.[8]

208
  1. సన్నిహితరాజీవాసనున్ = సమీపించినబ్రహ్మ గలవానిని, ఉద్యద్భానుకోటిప్రభాజాలోదంచితదివ్యతేజున్ = మిక్కిలి వెలుఁగునట్టి కోటిసూర్యులవలె వెలుఁగుచున్న కాంతిసమూహములో యన ఒప్పుచున్న దివ్యమయిన తేజస్సు కలవానిని, అనకృత్సౌభాగ్యలక్ష్మీయుతున్ = ఎడతెగక సౌభాగ్యలక్ష్మితో కూడుకొని యుండువానిని.
  2. సముచ్చస్వరములు = గట్టిగా వినపచ్చుకంఠస్వరములతో, పొరిఁ బొరిన్ = క్రమక్రమముగా.
  3. యోగనిద్రాప్రబుద్ధుఁడు = యోగనిద్రనుండి మేలుకొన్నవాఁడు, బన్నంబులు = భంగములను.
  4. పీతాంబరు చెప్పినయట్ల = పీతాంబరమును ధరించిన శ్రీహరి చెప్పినచొప్పున, ప్రొవై = గుంపు గూడి.
  5. పాడి = ధర్మము - యుక్త మనుట.
  6. సంఘట్టన = సంఘటన - ఇది యపూర్వప్రయోగము.
  7. పగ = శత్రువును, నిర్దేశించి = చెప్పి.
  8. అత్యారూఢప్రియభాషలన్ = అతిగౌరవములును ప్రియముల నైనమాటలతో, ఆసన్న = (బాధింప) సమీపించిన.