పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నన్నయభట్టు భాస్కరుని నాచనసోముని రంగనాథునిన్
వెన్నెలగంటిసూర్యుఁ బదివేలవిధంబులఁ గొల్చి భక్తితోన్.[1]

9


ఉ.

ఏను పరాశరుండు రచియించినవిష్ణుపురాణ మాంధ్రభా
షానిపుణోక్తులం బలుకఁజాలెద నంచుఁ దలంచినాఁడ శే
షానిలభుగ్విభుం డురుసహస్రశిరంబులఁ దాల్చులోకముల్
హీనపుఁబూరిపాము ధరియించెద నంచుఁ దలంచుచాడ్పునన్.[2]

10


మ.

హరిసంకీర్తన యైననాకవితయం దాక్షేపముల్ గల్గినన్
సరసత్వంబుల కామదిం దలఁపుడీ సర్వజ్ఞులై సత్కవుల్
కరమొప్పారెడుచంద్రబింబము కళంకప్రస్థ మయ్యున్ సుధా
పరిపూర్ణస్థితి నెల్లలోకముల సంభావ్యంబునం బొందదే.[3]

11


ఉ.

పన్నగశాయిసత్కథ లపారము లన్నియుఁ జెశ్పనోపుదే
సన్నపుబుద్ధివాఁడవని సత్కవులాడిన విన్నవించెదన్
మున్ను పితామహుండు మునిముఖ్యులు విష్ణుపురాణపద్ధతుల్
కొన్నియెకాక యన్నియును గోరి నుతించిరె యేయుగంబులన్.[4]

12


ఉ.

తామరసాక్షుపుణ్యచరితంబు లనంతము లందులోపలన్
నామది భక్తియుక్తియును నానిపుణత్వము నెట్టి దట్టివా
చామలవృత్తి నెన్నెద సుధాంబుధిలోపలినీరు చూచి తృ
ట్కాముఁడు వచ్చి దప్పి యడఁగందగుమాత్రము గ్రోలుచాడ్సునన్.[5]

13


ఉ.

ఆదర మొప్పఁగా సుకవు లారసి చాటుతరప్రబంధసం
పాదము మేలుమే లనుచుఁ బల్కిన నొప్పు జగత్ప్రసిద్ధమై
కాదని తప్పుఁబట్టి కొఱగామిఁ దలంచినఁ దొంటికాళిదా
సాదిమహాకవీశ్వరులకైనను నేరము లేకయుండునే.[6]

14


వ.

అని యిష్టదేవతాప్రార్థనంబును, పురాతనకవిస్తోత్రంబును, మదీయచిత్తసమా

  1. ప్రణమిల్లి సనమస్కరించి, ఎన్నికగాన్ = లెక్కపెట్టినట్లు, ఇందు చెప్పఁబడినవారు ఆంధ్రశవులలో ముఖ్యులు అని తెలియవలెను.
  2. అనిలభుగ్విభుండు = గాలిని భుజించునవి యైనపాములకు రాజు, పూరిపాము = పసిరిక పాము.
  3. ఆక్షేపములు = ఆక్షేపింపఁదగిన విషయములు, సర్వజ్ఞులు = అన్నియు తెలిసినవారు, కళంకప్రస్థము = కళంకము యొక్క మంచియునికి గలది, సుధాపరిపూర్ణస్థితిన్ = అమృతముయొక్క నిండినయునికిచేత, సంభావ్యము = సంభావింపఁదగినది, గౌరవించఁదగినది.
  4. పన్నగశాయి = శేషుఁడు పఱపుగాఁగల విష్ణువు, అపారములు = సరిలేనివి, సన్నము = అల్పము, పితామహుఁడు = బ్రహ్మ
  5. తామరసాక్షుఁడు = తామరలవంటి కన్నులుగల విష్ణువు, అనంతములు = అంతము లేనివి, యుక్తి = కూడిక, నిపుణత్వము = నేర్పరితనము, నాచామలవృత్తి = వాక్కులయొక్క నిర్మలమైన వ్యాపారము, సుధాంబుధి = పాలసముద్రము, తృట్కాముఁడు = దప్పిచేత కోరఁబడినవాఁడు - దప్పిగొన్నవాఁ డనుట.
  6. చాటుతరప్రబంధసంపాదము = మిక్కిలి స్తోత్రార్హమయిన ప్రబంధమును కలుగఁజేయుట, మేలుమేలు = ఇది ప్రశంసార్థము, కొఱగామి = పనికిమాలినతనమునుగా, తలంచినన్ = తలంచెడుపక్షమున.