పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కొదవయు లేదు నన్నుఁ దనకుం బ్రియురాలిగ నేలినాఁడు సం
పదలకు నేమిటం గొఱఁత పార్థివనాయక నాకు నావుడున్.

178


క.

ఇలఱేఁడు దనమనంబునఁ, గలఁగి జడుఁడు మౌని యొక్కకాంతకె మిగులన్
వలచి మఱియున్నభార్యలఁ దలఁపఁడొ కాకనుచు మిగులఁ దత్తఱపడుచున్.[1]

179


వ.

తగుతెఱంగున నయ్యిందువదన వీడ్కొని రెండవప్రాసాదంబున కరిగి తొంటి
వాలుఁగంటికంటె మహావిభవంబున నున్నపుత్రికారత్నంబువలన నమస్కారా
ద్యుపచారంబులఁ బ్రీతుండై కుశలం బడిగిన.[2]

180


క.

అప్పడఁతి యప్ప చెప్పిన, యప్పలుకులకంటెఁ దండ్రి కానందముగాఁ
జెప్పిన సంతోషము మది, ముప్పిరిగొన మఱియు నడిగె మూఁడవకూఁతున్.[3]

181


వ.

ఇవ్విధంబున నందఱ నట్ల యడిగిన వార లేఁబండ్రును నొక్కవాక్యంబుగా మగ
నివలన సకలసుఖంబు లనుభవించుచున్నవార మని చెప్పిన మాంధాత విస్మిత
చిత్తుండై సౌభరితపోమహత్త్వంబురకు మెచ్చి యతనికడకుం జని నమస్కరించి
యిట్లనియె.[4]

182


క.

నిన్ను వరించి సుఖస్థితి, నున్నారు కుమారికలు మహోల్లాసముతోఁ
గన్నియలను బెక్కండ్రను, గన్నఫలము నేఁడు చూడఁగంటి మహాత్మా.

183


క.

అని పెక్కుచందముల మునిఁ, గొనియాడి నరేశ్వరుండు కూఁతులకెల్లన్
ధనకనకవస్తువాహన, వనితారత్నముల గౌరవంబున నిచ్చెన్.

184


ఆ.

ఇచ్చి నిజపురమున కేగె సౌభరియు మాం, ధాతృదుహిత లైనధర్మపత్ను
లందు నైహికంబు లైనభోగములు పెం, పార సురతసుఖము లనుభవించె.

185


వ.

ఇవ్విధంబున నయ్యేఁ బండ్రుభార్యలందు నూటయేఁబండ్రుకుమారులం గాంచి.

186


సీ.

శైశవక్రీడాప్రసంగములో కొన్నేండ్లు కొన్నేండ్లు ముద్దుపల్కులబెడంగు
లల్లనల్లన నడయాడంగఁ గొన్నేండ్లు కొన్నేండ్లు విద్యావినోదగోష్ఠి
వడుగుప్రాయపువైభవంబులు గొన్నేండ్లు కొన్నేండ్లు వరయౌవనోన్నతులును
వైవాహికక్రియావ్యసనంబు గొన్నేండ్లు గొన్నేండ్లు కోడండ్రకోట్రములును


తే.

మనుమలును మనుమరాండ్రును మనఁగ వారి, సొబగు కొన్నేండ్లు కొన్నేండ్లు సుతుల సుతుల
తరతరంబును దామరతంపరైన, చూచి సంసారసుఖములఁ జొక్కె నతఁడు.[5]

187


వ.

ఇట్లు సంసారసాధనంబు లైనమనోరథంబులం దగిలి యనేకవత్సరంబులు వినో
దించి యొక్కనాఁడు పరతత్త్వచింతాసమాధానమానసుండై.

188
  1. ఇలఱేఁడు = రాజు.
  2. తొంటివాలుఁగంటికంటెన్ = మునుపటిచిన్నదానికంటె.
  3. అప్ప = అక్క
  4. విస్మితచిత్తుండు = ఆశ్చర్యమునొందిన మనసుగలవాఁడు.
  5. శైశవక్రీడాప్రసంగములు = శిశుత్వమునందలి యాటలయొక్క మేలైనకూడికలు, కోట్రములు = కోడంట్రికములు, తామరతంపర = అపరిమితము.