పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

తతఘనానద్ధసుషిరాభిధానవాద్య, కీలితామరకామినీగీతరవము
గలిగి త్రిభువనలక్ష్మికి నిలయమగుచుఁ, బరఁగు సౌభరి సౌభాగ్యపురవరంబు.[1]

165


వ.

ఇట్లు కనుంగొని.

166


క.

ము న్నెన్నఁడు లే దిచ్చట, నున్నది సురపురియుఁబోలె నొకపట్టణ మ
త్యున్నతవిభూతి వెలయుచు, నిన్నగరంబునకు నాథుఁ డెవ్వఁడో యనుచున్.

167


వ.

చేరవచ్చి యప్పౌరజనంబులవలన సౌభరి తపఃప్రభావంబున నైనపురం బగుట
యెఱింగి పరమహర్షాశ్రుపూరితలోచనుండై యమ్మహామునిం బొడగని నమ
స్కరించి తగుతెఱంగున సంభావితుండై.

168


క.

జననాయకుండు కన్యా, జనులం జూడంగఁ గోరి చనుదెంచిన య
ప్పని విన్నవించి యమ్ముని, యనుమతి నంతఃపురము నకటఁ జని యెదురన్.

169


మ.

కనియెన్ భూపతి రమ్యహర్మ్యనిలయం గర్పూరవీటీవరా
ననపద్మన్ మణిడోలికాచలితనానాభూషణాలంకృతన్
ఘనదివ్యాంబరసంవృతస్తనయుగళగాశ్మీరకస్తూరికా
ఘనసారాంచితగంధబంధురశుభాంగశ్రీనిధిం గన్యకన్.[2]

170


వ.

ఇట్లు కనుంగొనిన.

171


క.

జనకునిరాకకు వినయం, బును భక్తియుఁ బెనగొనంగఁ బూఁబోణి యెదు
ర్కొని దండనమస్కారము, లొనరిచి కరములు మొగిడ్చి యుచితప్రీతిన్.

172


క.

తనకేలీసౌధమునకుఁ, గొని చని యాసీనుఁ జేసి కుశల మడిగిన
జనపతి సర్వము సేమం, బని తెలియఁగఁజెప్పి కూఁతు నాశ్వాసించెన్.

173


వ.

ఇట్లు పరమానందహృదయుండై యతండు వెండియు నిట్లనియె.

174


మ.

పడఁతీ నీ చెలియండ్రు, నీవు సుఖులై భాసిల్లుచున్నారె మీ
యెడ నత్యంతవిధేయుఁడయ్యు విభుఁ డేవేళం బ్రమోదించునే
దొడుగం బుయ్యను గట్టఁగాఁ దగినవస్తువ్రాతముల్ గల్గునే
కుడువంగా సరసాన్నముల్ గలవె నాకుం జెప్పుమా యేర్పడన్.

175


వ.

అనినం దండ్రికిఁ గూఁతు రిట్లనియె.

176


క.

న న్నిప్పుడు మీ రడిగిన, వన్నియు నొకకడమ పడక యఖిలంబును సం
పన్నంబు మిమ్ముఁ జూడక, యున్నవిషాదంబెకాని యుర్[3] వీనాథా.

177


చ.

మదనసమానరూపమహిమం జెలువొంది మనోవిభుండు నా
సదనమునంద యుండు ననిశంబును మన్మథరాగభోగ మే

  1. భర్మ = బంగారు, దీప్తి = కాంతి, ఛటా = సమూహము, హర్మ్య = మేడలుగల, ప్రస్తూన = పుష్పములయొక్క సౌరభపరిమళముచేత, నిరాతంకశంకా = భయమును సంశయమును లేని, సంకీర్ణ = కలకలుపుగల.
  2. వీటీ = వీడెము, డోలికా = ఉయ్యెల, కాశ్మీర...శ్రీనిధిన్ = కుంకుమపువ్వు కస్తూరి పచ్చకర్పూరము వీనియొక్క ఒప్పిదమైనవాసనలచేత అతిశయించిన మనోజ్ఞమైన అవయవసంపత్తికి స్థానమైనదానిని
  3. కడమపడక = తక్కువపడక, సంపన్నంబు = సమృద్ధము, విషాదంబె = విచారమే.