పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యంబులును బహువిధప్రసూనగంధబంధురానేకీరకోకిలాదికలరవాభిరామంబు
లైనయారామంబులును లలితమృదులహంసతూలికానల్పంబు లైనతల్పంబులును
వినోదకేళివిహారలోలంబు లైనడోలాజాలంబులును మొదలుగా ననేకంబు
లనేకప్రకారంబులుగా నిర్మించిన.[1]

157


క.

మునినాథుఁ డైనసౌభరి, తనభార్యలనెల్ల సముచితముగను వేర్వే
ఱను గనకమందిరంబుల, నునిచి తపశ్శక్తివలన నూడిగములకున్.

158


క.

యువతులుగ నప్సరస్త్రీ, నివహంబుల నొసఁగి రామణీయాంబరది
వ్యవిభూషణమాల్యాదులు, వివిధపరిమళానులేపవితతులు నొసఁగెన్.[2]

159


ఆ.

అతిమనోహరంబు లగుభక్ష్యభోజ్యాది, సముచితాన్నపానచయము లెల్లఁ
గలుగజేసి యతఁడు కాంతాజనంబుల, యందు సురతసుఖము లనుభవించె.

160


వ.

ఇట్లు పరమగృహస్థధర్మంబున సంసారసుఖంబు లనుభవించుచున్న కొండొకకా
లంబునకు.

161


క.

బహుళీకృతరాజ్యరమా, మహనీయుండై వెలుంగు మాంధాతమదిన్
దుహితృస్నేహము పెనఁగొన, మహిళామణి యైనబంధుమతియుం దానున్.[3]

162


చ.

అడవులఁ గందమూలముల నాఁకలి దీర్చి తపంబు సేయుచున్
బడలినవృద్ధతాపసుని బాలికలతో సుకుమారమూర్తులన్
గడుసుఖు లైనవారలను గట్టిఁడినై వెసఁగట్టి త్రోచితిన్
నడుఁకుచు వార లెవ్విధమున దురపిల్లుచు నున్నవారొకో.[4]

163


క.

అని కూఁతుల సుఖదుఃఖము, లొనర విచారింపఁగోరి యుర్వీపతి స
జ్జనపరివృతుఁడై సౌభరి, మునియాశ్రమమునకు నరిగి ముందట గాంచెన్.

164


సీ.

బహువిధాలంకారభర్మదీప్తిచ్ఛటాప్రాకారమణిహర్మ్యభవనములును
నానావిధప్రసూనానూనసౌరభరమణీయమందిరారామములును
కలహంసచక్రవాకక్రౌంచకలనాదజలజకైరవజలాశయచయంబు
ధనధాన్యయుతనిరాతంకశంకాచతుర్వర్ణసంకీర్ణనివాసములును

  1. బహు...విశాలంబులు = నానావిధములైన వాకిళ్లు దిడ్డివాకిళ్లు తలుపులు కొఱళ్లు కోటలు అగడ్తలు వీని చేత విరివియైనవి, ప్రాసాదంబులు = నగరులు, భిత్తికా = గోడ, సంభృతము = చక్కగా భరించినది, దేహళీ = కడప, ప్రాంగణ = ముంగిలి, ప్రోత్ఫుల్ల...అతిశయంబులు = చక్కగా వికసించిన నల్లగలువలచేతను తామరపువ్వులచేతను కూయుచున్న రాజహంసలు కన్నెలేళ్లు మొదలగుపక్షులచేతను అతిశయించినవి, జలాశయంబులు = నీటిటెంకులు, ప్రసూన...కలరవాభిరామంబులు = పువ్వులవాసనలచేత మిక్కిలి యతిశయించిన పెక్కు చిలుకలు కోవెలలు మొదలగువాని యవ్యక్తమధురధ్వనులచేత ఒప్పినవి, తల్పంబులు = పానుపులు, లోలంబులు = ఊఁగునవి, డోలాజాలంబులు =ఉయ్యాలలసమూహములు.
  2. అనులేపవితతులు = పూసికొను ద్రవ్యములసమూహములు.
  3. బహుళీకృతరాజ్యరమామహనీయండు = అధికముగాఁ జేయఁబడిన దొరతనపుకలిమిచేత గొప్పవాఁడు, దుహితృస్నేహము = కొమార్తెలయందలిప్రేమ, మహిళామణి = స్త్రీరత్నము.
  4. కట్టిఁడిని = నీతి దప్పినవాఁడను, దురపిల్లుచున్ = దుఃఖించుచు.