పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

మున్నిటి మాకులంబునృపముఖ్యులు కన్యలఁ బెండ్లి సేయుచోఁ
గన్యల కిచ్చవచ్చుపతిఁ గైకొనిరేనియు నిత్తు రట్లుగా
కున్నఁ గులాభిజాత్యముల నున్నతి కెక్కినవారికైన నీ
రెన్నఁడు నిట్టి మాసమయ మిప్పుడు నేనును జెల్ల నిచ్చితిన్.[1]

139


చ.

అదియునుగాక జర్జరిత మైనశరీరముతోడఁ దద్దయున్
ముదిసినవాఁడ వీవు కడుమోహనరూపవిలాసరేఖలం
బొదలినవారు కన్నియలు భూరిగుణాకర నిన్నుఁ జూచినన్
హృదయములందు మెచ్చరని యిప్పుడు నామదిఁ తోఁచె నెంతయున్.[2]

140


వ.

అనిన నమ్ముని నగుచు మాంధాత కిట్లనియె.

141


ఉ.

నా కిది మంచిమాట నరనాయక కన్నియ లున్నచోటికిన్
దోకొనిపొమ్ము వారు పరితోషముతో నను నాదరించుచున్
జేకొనిరేనిఁ బెండ్లి తగఁజేయుము గాక తిరస్కరించినన్
బోకలఁబోక నే మగిడిపోయెద వచ్చినత్రోవ వెంబడిన్.[3]

142


ఆ.

అనిన నతనిమాట లంగీకరించి య, మ్మనుజవల్లభుండు మాఱుమాట
లాడవెఱచి కన్యకాంతఃపురంబుల, నుండువర్షధరుని నొకనిఁ బిలిచి.[4]

143


ఉ.

ఇమ్మునినాథుఁ గన్నియల కెల్లను జూపి ప్రియంబయేనిఁ గై
కొమ్మని చెప్పు మేతరుణికోరిన దానిన పెండ్లి సేసెదన్
సమ్మద మొప్పనంచు నృపచంద్రుఁడు సౌభరిఁ గూర్చి హెగ్గడిం
బొమ్మని యాజ్ఞయిచ్చె మునిపుంగవుఁడుం బ్రియ మందె నాత్మలోన్.

144


వ.

ఇవ్విధంబున సౌభరి కన్యకాంతఃపురంబుఁ బ్రవేశించి యఖిలసిద్ధసాధ్యగంధర్వమ
నుష్యులకంటె నతిశయంబైనరూపంబు ధరియించె నప్పుడు వర్షధరుండు రాజ
కన్యకాజనంబుల రావించిన.

145


ఉ.

కాఱుమెఱుంగులో మెలవుఁ గైకొన నేర్చిన పైఁడిబొమ్మలో
మారునిదీములో కలికిమాటలచంద్రికలో చెలంగు శృం
గారరసాధిదేవతలొ కమ్మని క్రొవ్విరితీఁగెలో యనన్
వారిజపత్రలోచనలు వచ్చిరి మోహవిలాసమూర్తులై.[5]

146


వ.

ఇ ట్లరుగుదెంచిన మాంధాతృదుహితలకు వర్షధరుం డిట్లనియె.

147


క.

మీతండ్రికడకు ముదుసలి, యీతాపసి వచ్చి కన్య నిమ్మనిన ధరి

  1. సమయము = ప్రతిజ్ఞ.
  2. జర్జరితము = సడలి ముడుతలు పడినది, మోహనరూపవిలాసరేఖలంబొదలినవారు = మోహింపఁజేయునట్టి సౌందర్యముయొక్కయు శృంగారచేష్టలయొక్కయు మేలిమిచేత అతిశయించినవారు.
  3. పరితోషముతోన్ = సంతోషముతో, పోకలఁబోక = దుష్టచేష్ట లేవియు చేయక.
  4. వర్షధరునిన్ = కొజ్జావానిని - హెగ్గడిని.
  5. మెలఁపు = మెలగుట - సంచారము, దీముఁలు = మృగములను పక్షులను వశపఱచుకొనుటకై మరిపిన పెంపుడుమృగములును పక్షులును, చంద్రిక = చంద్రకళ, క్రొవ్విరి = క్రొత్తగా పూచినపువ్వు.