పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ణ్యోదయ మీరు నాకడకు నొక్కరు రాఁబని యేమి కల్గెనో
నాదెస మీకుఁ గల్గినఘృణారసవారిధి యిట్టు లుబ్బెనో.[1]

126


క.

నావుడు మునినాథుఁడు వసు, ధావల్లభు నుచితవాగ్విధానంబుల సం
భావించి నీవు దాతవు, గావున ని న్నొకటి యడుగఁగాఁ దగు మాకున్.[2]

127

సౌభరి యనుమునీంద్రుండు మాంధాతకూఁతులఁ బెండ్లియాడి భోగంబు లనుభవించుట

ఆ.

ఎవ్వ రేపదార్థ మేవేళ గోరిన, వారి కుచితమైనవాని నెల్ల
నిచ్చి యనుపకునికి యిక్ష్వాకువంశజు, లైనభూపతులకుఁ గానివావి.[3]

128


ఉ.

అదియునుగాక విన్ము జగమంతయు నుజ్జ్వలబాహుశౌర్యసం
పద వెలయంగ నేలి సురభర్తకు నైననభీప్సితంబు లీ
నొదవినదాత వీ వగుట నొక్కఫలం బిహలోకసౌఖ్యమై
పొదలినదాని ని న్నడుగఁబూని ముదంబున నేగుదెంచితిన్.[4]

129


క.

క్షేత్ర మెఱిఁగి వి త్తిడుటయుఁ, బాత్ర మెఱిఁగి దాన మిచ్చి పనుచుటయు వివే
కత్రాణపరాయణులకు, ధాత్రీశ్వర యిందు నందుఁ దగ మేలొసఁగున్.

130


క.

అనవుడు నవ్విభుఁ డిట్లను, మునినాయక యేపదార్థములు గోరిన వా
నిన యిత్తు నుచితమైనవి, యనుమానము మాని యడుగు మని పలుకుటయున్.

131


ఉ.

ఇన్నిగుణంబులందు నుతి కెక్కినవాఁడవు సత్యవాక్యసం
పన్నుఁడ విట్టినీకు నరపాలక నా కొసఁగంగరానివే
మున్నవి యైననేమియును నొల్ల నరేంద్రకులావతంస నీ
కన్నియలందు నాకు నొకకన్నియ నిమ్ము గృహస్థు నయ్యెదన్.[5]

132


వ.

అనిన నమ్మహీవల్లభుండు.

133


క.

బడలికయుఁ జాల నరసిన, జడలును గడ్డంబు మిగుల జర్జరీతమునై
బెడ గెడలినపొడవును గడు, జడతయునుం గలిగినట్టి సౌభరిఁ జూచెన్.[6]

134


వ.

ఇట్లు చూచి తనమనంబున.

135


ఆ.

ఏమి సేయువాఁడ నీపని యెబ్భంగిఁ, దీర్తు ననుచు వసుమతీవిభుండు
చింతనొంది కొంతసేపున కనియె స, దు త్తరంబు గాఁగ నుపమ దలఁచి.[7]

136


క.

వచ్చిన యిమ్ముని నూరక, పుచ్చినఁ గోపించుఁగాని పోవిడువఁడు దా
నిచ్చెద ననినను గన్యలు, మెచ్చరు వార్ధకముచేత మెదిగినవానిన్.

137


వ.

అని యమ్ముని నవలోకించి.

138
  1. ఘృణారసవారిధి = దయారససముద్రము.
  2. సంభావించి = గౌరవించి.
  3. కానివావి = వరుస కానిది - వాడుక లేనిది.
  4. అభీప్సితములు = కోరికలు, ఒదవిన = కలిగిన, పొదలినదానిన్ = గొప్ప వహించినదానిని.
  5. నరేంద్రకులావతంస = రాజశిరోమణి.
  6. జర్జరితము = శిథిలమైనది - మిక్కిలి కృశించినది, బెడఁగెడలిన = బాగుతప్పిన, పొడవు = ఆకారము.
  7. తీర్తును = నెఱవేర్తును, ఉపమ = ఉపాయము.