పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గరుడసిద్ధసాధ్యగంధర్వపన్నగ, వరులు గొల్వ వచ్చె వాసవుండు.

114


వ.

వచ్చి యమ్మహామునుల నవలోకించి యీయర్భకుండు మదీయరాజ్యంబును
నన్నును భరియింప సమర్థుండగుటంజేసి మాంధాత యను నామంబు చేసితి
నని పలికి.

115


తే.

వరసుధామృతధారలు దొరుగుచున్న, తనప్రదేశిని నమ్మహీవరకుమారు
నోరి లోపల నిడి కడుపారఁ దుష్టి, చేసె బండ్రెండుసమములు వాసవుండు.[1]

116


వ.

ఇవ్విధంబునఁ బండ్రెండేళ్లకుమారుండై మాంధాత సప్తద్వీపసమేతం బైనవసుం
ధరాచక్రం బవక్త్రపరాక్రమంబున ననుభవించి చక్రవర్తియైన.

117


తే.

సూర్యుఁ డుదయించి క్రుంకెడుచోట్ల నడిమి, ధాత్రియెల్లను యువనాశ్వపుత్రుఁడైన
యట్టి మాంధాతృక్షేత్రంబె యని జగంబు, లభినుతించుచు నుండుదు రనుదినంబు.

118


వ.

అట్టి మాంధాత శశిబిందుపుత్రి యైనబంధుమతిం బాణిగ్రహణంబు చేసి దాని
యందుఁ బురుకుత్సాంబరీషముచికుందు లనుకుమారుల మువ్వురం బడసి మఱి
యును.

119


తే.

మెఱుఁగుఁదళుకు లనఁగ మెలఁగెడుబంగారు, బొమ్మ లనఁగ గమ్మపువ్వుతీఁగె
లనఁగ మోహనాంగు లైనకన్నియల నేఁ, బండ్రఁ గాంచె రాజు ప్రమదమునను.[2]

120


వ.

ఇవ్విధంబున లబ్ధసంతానుండై మాంధాత రాజ్యంబు సేయుసమయంబున.[3]

121


క.

జననుతచరితుఁడు సౌభరి, యనఁగా నొకదివ్యమౌని యంతర్జలముల్
తన కునికిపట్టుగాఁ దప, మొనరించె శతాబ్దకాల మున్నతభక్తిన్.[4]

122


ఉ.

అందు నతిప్రమాణసముదంచితదేహముతోడ నందనీ
నందనబంధుమిత్రులు మనఃప్రమదంబున నిత్యకృత్యముల్
క్రిందను మీఁదఁ బార్శ్వములఁ క్రీడ యొనర్పఁగ సంచరించుచో
మందుఁ డనంగఁ బేరుగల మత్స్యవిభుం డొకఁ డుండె నర్థితోన్.

123


క.

బహువిధముల నాజలచర, విహారసౌఖ్యములు చూచి వేడుకతో న
మ్మహితాత్తుఁడు గృహపతియై, యిహసౌఖ్యము లనుభవింప నిచ్చఁ దలంచెన్.

124


వ.

ఇవ్విధంబునం దపస్సమాధివలన నిలిపిన లక్ష్యంబు వదలి సంసారసుఖంబులకు నభి
ముఖుండై యంతర్జలంబులు వెలువడి కన్యార్థియై మాంధాతపాలికి వచ్చిన.

125


ఉ.

ఆదర మొప్పఁగా నృపకులాగ్రణి యమ్ముని కాసనార్ఘ్యపా
ద్యాదిబహూపచారవిధు లర్థి నొనర్చి నమస్కరించి పు

  1. తొరఁగు = స్రవించు, ప్రదేశిని = చూపుడువ్రేలు, పండ్రెండుసమములు = పండ్రెండేండ్లు.
  2. తళుకులు = తళతళయను కాంతులు, కమ్మ= పరిమళము గల.
  3. లబ్ధ = పొందఁబడిన.
  4. అంతర్జలములు = లోపలినీళ్లు - నీళ్లలోపలి ప్రదేశము అనుట.