పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

 సనకసనందాదిసంయమీశ్వరులకు సంతతానందంబు సలుపువాని
లీలావినోదకేలీవిలాసంబుగా భువనంబులన్నియుఁ బ్రోచువానిఁ
గలశపాథోరాశికన్యకారత్నంబు నొద్దికతోఁ గూడియున్నవాని
శతకోటిభాస్కరసందీప్తతేజుఁడై దుర్నిరీక్ష్యస్థితిఁ దోఁచువాని


తే.

శంఖచక్రగదాశార్ఙ్గసాధనములు, నలుగడలఁ జేరి భజియింప నలరువానిఁ
బుండరీకాక్షు నతులభూభువనరక్షు, విష్ణుదేవునిఁ బొడగాంచి విబుధవరులు.[1]

79


వ.

దండవన్నమస్కారంబులు చేసి భయార్తులై దానవులచేతం దమపడినబన్నంబులు
విన్నపంబులు చేసినఁ బన్నగశయనుం డాపన్ను లైనయన్నిలింపుల కిట్లనియె.[2]

80


క.

మీ కేమిభయము దానవ, లోకంబులఁ జంపి పోరిలో జయలక్ష్మీన్
జేకొని మిము రక్షింపఁగ, భూకాంతుం డొకఁడు గలఁడు భూరిబలుండై.

81


క.

రాజర్షి యగుశశాదుత, నూజుండు పురంజయుఁడు మనుజలోకమునన్
రాజిల్లు మదీయాంశము, తేజంబున నమ్మహీశతిలకం బయ్యెన్.

82


ఉత్సాహము.

ఆపురంజయుండు మీకు నహితు లైనదైత్యులన్
రూపుమాప నోపుఁ దదనురూపమైనవృత్తి మీ
రోపి సేయుఁ డింక శంక లుజ్జగించి యవ్విభున్
బ్రాపు వేడుకొండు పొండు పైనమై ధరిత్రికిన్.[3]

83


మ.

అని యి ట్లానతి యిచ్చి పంపుటయు దేవానీకముల్ ధాత్రికిన్
జని సాకేతపురంబులో నతులరాజ్యశ్రీలఁ బెంపొందుచు
న్ననరేంద్రోత్తమునిం బురంజయుని నానాలోకసంసేవితున్
మనువంశోత్తముఁ గాంచి యాదరమునన్ మన్నించి వా రర్థితోన్.[4]

84


ఉ.

ఓజననాథ మాదగు ప్రయోజనముల్ విను దైత్యకోటిచే
నాజులలోఁ బరాజితులమై హరిఁ జేరితి మవ్విభుండు నీ
తేజముఁ జెప్పినం గలఁకదేఱి నినుఁ భజియించినార మ
వ్యాజసుఖంబు లీయమరవర్యుల కిచ్చి వధింపు శత్రులన్.[5]

85


వ.

అని యనేకవిధంబులం బ్రార్థించినఁ బార్థివనందనుండు బృందారకబృందంబున
కిట్లనియె.[6]

86
  1. కలశపాథోరాశి = పాలసముద్రము, సందీప్తతేజుఁడు = లెస్సగా వెలుఁగునట్టి తేజస్సుగలవాఁడు, దుర్నిరీక్ష్యస్థితిన్ = చూడనలవిగానియునికితో.
  2. బన్నంబులు = భంగములను, ఆపన్నులు = ఆపదనొందినవారు, నిలింపులకున్ = దేవతలతో.
  3. రూపుమాప నోపున్ = చంపఁజాలును, తదనురూపము = దానికి తగినది. ఉజ్జగించి = విడిచి, ప్రాపు = ప్రాపుగా - రక్షకుఁడుగా.
  4. పెంపొందు = వర్ధిల్లు, నానాలోకసంసేవితున్ = అనేకజనులచేత లెస్సగా కొలువఁబడుతున్నవానిని, మన్నించి = గౌరవించి.
  5. ఆజులలోన్ = యుద్ధములయందు, పరాజితులము = ఓడఁగొట్టఁబడినవారము, కలఁకదేఱి = కలవరమునుండి తేఱినవారమై, భజియించినారము = సేవించినాము.
  6. పార్థివనందనుండు = రాజకుమారుఁడు.