పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

బలువేఁటవెంట నడవిం, గలమృగములనెల్లఁ జంపి కడునాఁకటిచే
నిలువంగలేక యొకశశ, పలలము కఱకుట్లు చేసి భక్షించి యొగిన్.[1]

69


క.

ఆచిక్కినమాంసంబు య, థోచితముగఁ దెచ్చి తండ్రి కొసఁగిన మనువం
శాచార్యుఁ డగువసిష్ఠుఁడు, చూచి వివేకించి యది యశుద్ధం బగుటన్.[2]

70


వ.

ఇక్ష్వాకు నవలోకించి యిట్లనియె.

71


మ.

జననాథోత్తమ నేఁడు నీసుతుఁడు దా శ్రాద్ధార్థమై సంతరిం
చినమాంసంబులు మీఁదుబుచ్చి శశమున్ ఛేదించి భక్షించి త
క్కినయుచ్ఛిష్టము దెచ్చినాఁ డకట యెంగి ళ్లేగతిం బైతృకం
బునకుం బెట్టఁగ యోగ్యమౌనె యనినన్ భూపాలకుం డుగ్రుఁడై.[3]

72


తే.

ఆకుమారుని గోపించి యప్పు డడవి, కరిగి మృగమాంసములు దెచ్చి యర్హమైన
యష్టకాశ్రాద్ధకర్మంబు లాచరించె, నవ్వసిష్ఠాదిమౌనీంద్రు లలరుచుండ.[4]

73


వ.

ఇవ్విధంబున నిక్ష్వాకుండు పుణ్యశ్లోకుండై యుండె వికుక్షియు శశభక్షకుం
డగుటం జేసి శశాదుం డనంబరఁగె నట్టిశశాదుండు తండ్రిపిమ్మట నఖిలభూమం
డలంబు ధర్మమార్గంబునం బరిపాలించి.

74


ఉ.

నెట్టిన నశ్వమేధములు నెమ్మి ననేకము చేసి వైరులం
గిట్టి వధించి లోకములఁ గీర్తి దళంబుగ నించె మించఁగా
నట్టిశశాదుఁ డాత్మసుతుఁ డైనపురంజయు భూమి యేలఁగాఁ
బట్టము గట్టి కొనకుఁ దపం వరింపఁగఁబోయెఁ బెంపుతోన్.[5]

75


క.

రంజితభువనత్రయుఁడు పు, రంజయుఁ డిక్ష్వాకుఁ బోలి రమణీయయశో
మంజులుఁడై భూజనులకు, సంజీవినిఁబోలె నేలె జగతి మునీంద్రా.[6]

76


క.

ఆకాలంబున రాక్షస, నాకౌకసులకు మహారణంబైన సురా
నీకంబుల సురకోటికిఁ, గాక వెఱచిపఱచి రధికకంపితమతులై.[7]

77


వ.

ఇవ్విధంబునం బురందరప్రముఖనిఖలదేవతలు వైకుంఠంబునకుం జని.

78
  1. శశపలలము = కుందేటిమాంసము, కఱకుట్లు = కఱ్ఱచే గ్రుచ్చి కాల్పఁబడిన మాంసఖండములు.
  2. వివేకించి = తెలిసికొని.
  3. సంతరించిన = సంపాదించిన, ఉగ్రుఁడు = కోపము గలవాఁడు.
  4. అలరు = సంతోషించు.
  5. నెమ్మి = నెమ్మదిగా, దళంబుగన్ = దట్టముగా, పెంపుతోన్ = గౌరవముతో.
  6. రంజితభువనత్రయుఁడు = అనురాగము నొందింపఁబడిన మూఁడులోకములు గలవాఁడు, మంజులుఁడు = మనోజ్ఞుఁడు, జగతిన్ = భూమిని.
  7. నాకౌకసులకున్ = దేవతలకు, మహారణము = గొప్పయుద్ధము, సురానీకంబులు = దేవతాసమూహములు, కాక = సరిపోలఁజాలక, కంపితమతులై = చలించినమనసులుగలవారై,