పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


న్నతతేజోనిధిఁ గన్గోని, యతనికిఁ బ్రార్థించి యిచ్చె నాత్మతనూజన్.[1]

57


ఉ.

ఇచ్చి కృతార్థుఁ డైనమనుజేంద్రుఁడు తక్కినవారు చూడఁగా
నచ్చపలాయతాక్షి పొడవైనశరీరము లాంగలంబునం
గ్రుచ్చి హలాయుధుండు కడుఁగొంచెము చేసి వివాహమై కడున్
మచ్చికతో వహించె గరిమంబున నైహికభోగసంపదల్.[2]

58


వ.

ఇట్లు బలభద్రునకు రేవతిం బాణిగ్రహణంబు సేయించి కకుద్మి హిమవంతంబు
నకుం దపంబు సేయం జనియె.

59


ఉ.

రైవతుఁ డాదికాలమున రాజ్యము సేయక బ్రహ్మపాలికిం
బోవుట చూచి రాక్షసులు పుణ్యజనాఖ్యులు పూర్వవైరముఁల్
భావములందుఁ గ్రందుకొన బల్విడి నాతనిదేశమెల్ల ని
చ్ఛావిధిఁ జూఱగైకొని కుశస్థలియంతయుఁ బాడుచేసినన్.[3]

60


వ.

కకుద్మి సహోదరులు నూర్వురుఁ బుణ్యజనభయార్తులై నానాదేశంబుల నుండి
రారాజవంశంబుల ననేకులు పుట్టిరి.

61


క.

భూభుజుఁ డగునభగునకును, నాభాగుఁడు పుట్టె నతఁడు నానాధర్మ
స్వాభావికుఁడై యేలెను, భూభాగంబెల్లఁ గీర్తి భువనము నిండన్.[4]

62


శా.

ఆనాభాగున కంబరీషుఁ డుదయంబయ్యెన్ విరూపాఖ్యుఁ డా
భూనాథోత్తముపుత్రుఁడై బహుముఖంబుల్ చేసి నారాజు తే
జోనీరేరుహమిత్రుఁ గాంచెఁ బృషదశ్వున్ వాఁడు ధర్మక్రియా
సూనుం గాంచె రథీరథుం డనఁగ నత్యుగ్రప్రతాపోన్నతున్.[5]

63


తే.

ఆరథీరథువంశజు లైననృపతు, లాంగిరసనామములతోడ నవని యేలి
వంశవర్ధనులై తపోవైభవమున, నుల్లసిల్లుచు నేడును నున్నవారు.

64


క.

వైవస్వతుండు తుమ్మిన, నావిభుముకుఁగ్రోళ్లఁ బుట్టె నతులైశ్వర్య
శ్రీవిభుఁడు సాధుజనసే, వావిధుఁ డిక్ష్వాకుఁ డర్కవంశవిభుండై.[6]

65


వ.

ఆయిక్ష్వాకునకు నూర్వురు కుమారులు జన్మించి రందు గుక్షియు వికుక్షియు
దుందుండు ననుమువ్వురను నిజరాజ్యపదంబున నియోగించి.

66


ఆ.

తండ్రికంటె నధికధార్మికుఁడై మహీ, చక్ర మెల్ల నతిపరాక్రమమున
నేలె మనుతనూజుఁ డిక్ష్వాకుఁ డయ్యయో, ధ్యాపురంబు రాజధానిగాను.

67


వ.

అమ్మహీపతి యొక్కనాఁ డష్టకాశ్రాద్ధంబు సేయువాఁడై మృగమాంసంబు
దెమ్మని వికుక్షిం బనిచిన నతం డనన్యశరణ్యం బైనయరణ్యంబునకుం జని.

68
  1. అతులోదీర్ణస్ఫటికక్షితిభృత్సమగాత్రుఁడు = సరిలేని వెలుఁగునట్టి స్ఫటికపుకొండతో సమానమైన దేహముగలవాఁడు, సీరధరున్ = నాఁగేలు ధరించినవానిని - బలరాముని.
  2. మచ్చికతోన్ =ప్రేమతో.
  3. ఇచ్ఛావిధిన్ = ఇచ్చవచ్చినట్లు, చూఱగైకొని = కొల్లపెట్టుకొని.
  4. భువనము = లోకము.
  5. ధర్మక్రియానూనున్ = పుణ్యకర్మములచేత తక్కువకానివానిని - ఎల్లపుణ్యకర్మములు నడపువానిని.
  6. ముకుఁగ్రోళ్లన్ = ముక్కురంధ్రములందు.