పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

క్రతువులు నూఱు చేసి త్రిజగంబుల నేలి సమస్తదేవతా
ప్రతతులఁ బ్రోచువజ్రి వృషభం బగునేనియుఁ దత్కకుత్స్థలం
బతులితశక్తి నెక్కి చని యాజి నెదుర్కొని దైత్యవర్గమున్
హతముగఁ జేసి మీకు విజయం బొనరించెద నిక్క మింతయున్.[1]

87


తే.

అనిన నింద్రాదిదేవత లట్ల కాక, యని యొడంబడి రప్పు డయ్యమరభర్త
వృషభరూపంబుతోడ భూవిభునియెదుర, నిలిచె శివుఁ జేరి యున్న నందియునుబోలె.

88


క.

ఆవృషభకకుత్స్థుండై, భూవరుఁ డతిభక్తితోడఁ బురుషోత్తమునిన్
భావించి కొలిచి తత్తేజోవిభవముఁ దాల్చి సకలసురులున్ గొలువన్.[2]

89


క.

దురమునకు నరిగి దానవ, వరులం బరిమార్చి వాసవప్రభృతులకున్
బరమానందముఁ బెంపును, నిరమిత్రము జేసెఁ కార్యనిధియై కడిమిన్.[3]

90


వ.

ఇవ్విధంబునం బురంజయుండు వృషభకకుత్స్థుం డగుటంచేసి కకుత్స్థనామంబునం
బరఁగె.

91


తే.

ఆకకుత్స్థునినందనుఁ డయ్యె వేనుఁ, డెంచఁగా వేనునకు నుద్భవించెఁ బృథుఁడు
పృథుకు విశ్వగుఁ డతనికిఁ బృథుయుతుండు, పుట్టె వానికిఁ జంద్రుండు పుత్రుఁ డయ్యె.[4]

92


క.

చంద్రునకు యౌవనాశ్వన, రేంద్రుఁడు జన్మించె నతని కిద్ధచరితుఁడౌ
నింద్రయశుఁడు శావస్తుఁడు, సాంద్రయశుం డుద్భవించె సౌజన్యనిధీ.

93


క.

ఆవసుధేశ్వరుపేరను, శావస్తి యనంగఁ బురి ప్రశస్తి వహించెన్
భూవలయంబున నది యమ, రావతియునుబోలె మిగుల రమ్యం బగుచున్.

94


తే.

అట్టిశావస్తునకు బృహదశ్వుఁ డనఁగ, సుతుఁడు జన్మించెఁ గువలయాశ్వుండు వాని
పుత్రుఁ డయ్యను విష్ణునిభూరిమహిమ, దాల్చి భూలోకమంతయుఁ దానె యేలె.

95


ఉ.

తొల్లి యుదంకుశాపమున దుందుఁడు ఘోరనిశాటుఁడై జగం
బెల్లను బాధసేయఁగ మునీంద్రులు భీతిలిపోయి యమ్మహీ
వల్లభుతోడఁ జెప్పిన నవార్యబలోన్నతి యుల్లసిల్లఁగా
నల్ల ననేకవింశతిసహస్రకుమారులఁ గూడి సేనతోన్.[5]

96
  1. ప్రతతులన్ = సమూహములను, వజ్రి = ఇంద్రుడు, కకుత్స్థలంబు = మూఁపుప్రదేశము.
  2. కకుత్స్థుండు = మూఁపునఁ గూర్చున్నవాఁడు, భావించి = ధ్యానించి.
  3. దురమునకున్ = యుద్ధమునకు, పెంపు = గౌరవము, నిరమిత్రము = శత్రువులలేమి.
  4. పృథునకున్ = పృథుచక్రవర్తికి.
  5. అల్లనన్ = మెల్లగా - క్రమముగా.