పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గొనకొని వేఱువేఱ నొకకొందఱిఁ బేర్కొని వీరిలోన నె
వ్వనికి మదీయపుత్రిని వివాహము సేయుదు నాన తీఁగదే.[1]

39


వ.

అనినం దరహసితవదనుండై పితామహుం డిట్లనియె.

40


ఆ.

వసుమతీశ నీవు వచ్చి యిచ్చోట గాం, ధర్వవిద్యయందుఁ దగిలి వినుచు
నునికిఁ జేసి యొకముహూర్తంబు చెల్లిన, కాలమునను బహుయుగములు చనియె.

41


క.

మహిలో నిరువదియెనిమిది, మహాయుగము లరిగె నిపుడు మనుకాలంబై
సహజము లైనయుగంబుల, మహిమలు నీ కెఱుఁగరాదు మాలోకమునన్.

42


ఉ.

నీ విపు డర్థిఁ జెప్పిన మహీశులు నాఁడె ధరిత్రి యేలి కా
లావధి నొంది పోయిరి తదన్వయసంభవులందుఁ బుత్రపౌ
త్రావలు లెందఱేనియు లయంబునఁ బొంది రనేకభంగులం
గావునఁ జేరువం గలియుగం బగుచున్నది రాజనందనా.[2]

43


తే.

ధాత్రిలోపల నీపుత్రమిత్రసహజ, బలకళత్రసచివభృత్యబంధుకోశ
ములు మొదలుగాఁగఁ గాలంబువలన బహుప, రంపరలు చెల్లె నిప్పుడు రాజముఖ్య.[3]

44


క.

నీ వింక ధరణికిం జని, యీవనితం దగినవరున కిమ్మనిన ధరి
త్రీవల్లభుఁ డాశ్చర్యర, సావేశుం డగుచు మ్రొక్కి యజ్ఞజుఁ బల్కెన్.[4]

45


క.

 జగదేకనాథ యిప్పుడు, జగతీతల మేలు రాజచంద్రులలోనన్
మగువకు ననుకూలుం డగు, మగని విచారించి చెప్పి మన్నించఁగదే.

46


చ.

అనవుడు సర్వలోకగురుఁ డైనపితామహుఁ డాదరంబునన్
వినమితమస్తకుండును వివేకపరిస్ఫుటమానసుండునై
యొనరఁగ గొంతసేపు దలపోసి మహాత్ము నెఱింగి సంతసం
బునఁ గరపద్మముల్ మొగిచి ముత్పులకల్ జనియింప నిట్లనున్.[5]

47


క.

జగతీశ నీతనూజకుఁ, దగినవరుం డున్నవాఁడు ధరణీస్థలిలో
జగదేకరక్షణక్రముఁ, డగువిష్ణుం డమ్మహాత్ముఁ డై జనియించెన్.[6]

48
  1. అంఘ్రులకున్ = పాదములకు, పేర్కొని = పేరు గ్రుచ్చి చెప్పి.
  2. కాలావధిన్ = కాలముయొక్క మేరను - జీవిత కాలపుపరిమితిని, లయంబునఁ బొందిరి = చచ్చిరి.
  3. పుత్రమిత్రసహజబలకళత్రసచివభృత్యబంధుకోశములు = కొడుకులు చెలికాండ్రు తోడఁబుట్టువులు దండు భార్యలు మంత్రులు సేవకులు చుట్టములు ధన ముంచుకొట్టళ్లు.
  4. అబ్జజున్ = బ్రహ్మతో.
  5. వినమితమస్తకుండు = మిక్కిలివంపఁబడిన తలగలవాఁడు, వివేకపరిస్ఫుటమానసుండు = యుక్తవిచారముచేత ప్రకాశించునట్టి మనసు గలవాఁడు, తలపోసి = ఆలోచించి, కరపద్మముల్ మొగిచి = ఆమహాత్మునిఁ గూర్చి కరకమలములను ముకుళించి, ముత్పులకలు = సంతోషాతిశయమువలని రోమాంచములు.
  6. జగదేకరక్షణక్రముఁడు = లోకమునకు ముఖ్యమైన రక్షించునట్టిమర్యాద గలవాఁడు.