పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

ఆయురైశ్వర్యసంపన్ను లతులధార్మి, కులు మహాత్ములు వీర్యవంతులు ననంగ
మహి వెలింగిరి తృణబిందుమహిమవలన, సశలవైశాలికావనీశ్వరచయంబు.[1]

31


వ.

ఇది దిష్టవంశప్రకారం బనిచెప్పి మఱియును.

32


క.

మనుసుతుఁ డగుసంయాతికి, జనియించెను గన్య యనఁగఁ జంద్రానన య
వ్వనితారత్నముఁ జ్యవనుం, డనుమునిభార్గవుఁడు పెండ్లియాడెన్ బ్రీతిన్.

33


వ.

మఱియు నాసంయాతికిఁ బరమధార్మికుం డైన యానర్తుండు పుట్టె వానికి రేవ
తుండు పుట్టె నతండు కుశస్థలి యనుపురంబున రాజ్యంబు చేసి నూర్వురుకుమా
రులం బడసె నందు భ్రాతృశతజ్యేష్ఠుం డైనకకుద్మి యనువానికి రేవతి యను
కన్యారత్నంబు పుట్టె.[2]

34

రేవతీబలరాములవివాహప్రకారము

చ.

అభినవచారుయౌవనవిహారసమంచితవైభవంబులం
ద్రిభువనలక్ష్మికిన్ వెనుక తీయనికన్నియఁ జూచి తండ్రి యీ
యిభగమనం వరింపఁ బతి నెవ్వనిఁ గట్టడ సేసెనొక్కొ ప
ద్మభవుఁడు నాకు నిట్టియనుమానము మాను నతండు చెప్పినన్.[3]

35


వ.

అని విచారించి రేవతీసమేతుండై యారాజు బ్రహ్మలోకంబునకుం బోయె నప్పు
డప్పితామహుండు హాహాహూహు లనుగంధర్వులచేత దివ్యగాంధర్వంబు
వినుచుండుటంజేసి తనకు నవసరంబులేక ముహూర్తమాత్రంబు తానును దదీ
యసంగీతవిద్యావిలాసంబులకుం జొక్కి. మసలె నక్కాలంబున ననేకమహాయు
గంబులు చనియె గీతావసానంబున సుముఖుం డైనచతుర్ముఖునకుం బ్రణమిల్లి
కరంబులు మొగిచి యిట్లనియె.[4]

36


క.

దేవా యిది నాకన్నియ, రేవతి యీకమలముఖ వరింపఁదగినధా
త్రీవరకుమారు నెవ్వనిఁ, గావించితి వానతిచ్చి కరుణించఁగదే.[5]

37


క.

అనినఁ బితామహుఁ డిట్లను, జననాయక నీకు లాభిజ్యములకుఁ దా
ననుకూలుఁ డైననృపనం, దనునకు నెవ్వనికి నొసఁగఁ దలఁచితి కూఁతున్.[6]

38


చ.

అనినఁ గకుద్మి పద్మజునియంఘ్రులకు బ్రణమిల్లి తొల్లి రా
జ్యనిరతి నుండుకాలమున సన్నుతికెక్కిన రాజకోటిలోఁ

  1. వైశాలికావనీశ్వరచయంబు = విశాలుని వంశస్తులైన రాజులయొక్క సమూహము.
  2. భాతృశతజ్యేష్ఠుండు = నూఱుగురు సహోదరులందును పెద్దవాఁడు.
  3. అభినవ = క్రొత్తయైన - అపూర్వమైన, ఇభగమనన్ = ఏనుఁగువలె గంభీరమైననడక గలదానిని, కట్టడ చేసెనొక్కొ = నిర్ణయించెనో.
  4. గాంధర్వంబు = గానము - పాట, అవసరంబు = సమయము, మసలెన్ = ఆలస్యము చేసెను, గీతావసానంబునన్ = పాటముగిసినతోడనే.
  5. కన్నియ = కూఁతురు.
  6. నీకులాభిజాత్యములకున్ = నీయొక్క జాతికిని ఉత్తమవంశమునందలి పుట్టుకకును.