పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ల్లను దుర్వారబలప్రతాపవిభవోల్లాసంబు శోభిల్లఁగా
ననురాగంబున నేలె నవ్విభుఁడు దా నాదేవతాసార్వభౌ
మునికంటెన్ బలవంతుఁడై రిపుకులంబున్ గూల్చె నుగ్రాజులన్.[1]

24


సీ.

క్రతుశాల మొదలుగాఁ గలసాధనము లెల్లఁ గాంచనమయములుగా నొనర్చెఁ
బ్రత్యక్షమున సోమపానంబు గావింప దేవతావల్లభుఁ దెచ్చి తనిపె
గౌరవంబున మరుద్గణముల రావించి పరివారముగఁ జేసి పనులు గొనియె
సకలనిర్జరులను సభ గూర్చి యండఱ నయ్యైవిధంబుల నాదరించె


తే.

దక్షిణలుగా మహీదేవతలకు పసిఁడి, త్రవ్వి తండంబులుగఁ జేసి తనియ నిచ్చి
యశ్వమేధంబు గావించె నమ్మరుత్తుఁ, డఖలలోకంబులును దన్ను నభినుతింప.[2]

25


వ.

అట్టిమరుత్తునకు సరిష్యంతుండును సరిష్యంతునకు దముండును వానికి రాజవర్ధ
నుండును ఆతనికి సుధృతియును సుధృతికి నరుండును నరునకుఁ గేరళుండును
బుట్టి రట్టికేరళునిపేరం గేరళదేశం బయ్య నాకేరళునకు బంధుమంతుండును
వానికి వేగవంతుండును వానికి బుధుండును బుధునకుఁ దృణబిందుండును
బుట్టిరి.

26


తే.

అట్టితృణబిందునకుఁ గన్యయై జనించె, నిలబిలానామమున నొక్కయిందువదన
యామృగాక్షి యలంబస యనఁగ నొక్క, యప్సరసం గాంచెఁ గూఁతుఁగా నర్థితోను.

27


ఉ.

ప్రీతి వహించి దానిఁ దృణబిందుఁడు పెండిలియాడి లోకవి
ఖ్యాతచరిత్రుఁడై మెఱసినట్టివిశాలునిఁ గాంచెఁ బుత్రుఁగా
నాతనిపేర నీధరణియందు వెలింగె విశాలనాఁ బురం
బాతతరాజ్యవైభవసమంచితలక్ష్మికి జన్మభూమియై.

28


సీ.

ఆవిశాలునిపుత్రుఁడై హేమచంద్రుండు జనియించె నతనికిఁ జంద్రుఁ డనఁగ
దనయుఁడు పొడమె నాతనికి ధూమ్రాశ్వుండు జనియించె నతఁడు సృంజయుని గాంచె
నాసృంజయునిపుత్రుఁడై సహదేవుండు పుట్టె గుణాశ్వుఁ డాభూమిపతికి
సుతుఁడయ్యె నతనికి సోమదత్తుఁడు పుట్టె నారాజచంద్రుండు నవని యేలె


తే.

నర్థితోడ దశాశ్వమేధాధ్వరములు, చేసి కాంచనరత్నవిలాసినీతు
రంగమోత్తుంగగోధేనురాజినెల్ల, దక్షిణల భూమిసురులకుఁ దనియ నిచ్చి.

29


క.

ఆజననాయకునకు సుతుఁ, డై జనమేజయుఁడు పుట్టె నతులితబలతే
జోజయశాలి యతనికిని, రాజన్యుఁడు సుమతి పుట్టె రాజతయశుఁడై.

30
  1. జగన్మాన్యుండు = లోకమునందు పూజ్యుఁడు, దుర్వార = అణఁపరాని, రిపుకులంబున్ = శత్రుసమూహమును, ఉగ్రాజులన్ = భయంకరమైన యుద్ధములయందు.
  2. తనిపెన్ = తృప్తి నొందించెను, మరుద్గణములన్ = దేవతాసమూహములను, త్రవ్వి తండములుగన్ = అపరిమితములుగా.