పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

జగదారాధ్యుఁడు విష్ణుమూర్తిధరుఁడున్ సర్వాగమాధీశుఁడున్
భగవంతుండును యోగివంద్యుఁడుఁ బరబ్రహ్మస్వరూపంబునై
తగ జన్మించె హిరణ్యగర్భుఁడు జగద్రక్షాగరిష్ఠాత్మకుం
డగునారాయణునాభిపద్మమున సృష్ట్యర్థంబుగా నర్థితోన్.[1]

7


ఆ.

అబ్జభవునిదక్షిణాంగుష్ఠమున దక్షుఁ, డవతరించె నతని కదితి పుట్టె
నాసతీలలామయందుఁ గశ్యపునకు, దివసకరుఁడు పుట్టి తేజరిల్లె.[2]

8


ఆ.

కమలహితుఁడు విశ్వకర్మతనూభవ, యైనసంజ్ఞయందు నాత్మసుతుని
జనన మొందఁజేసె సాంప్రతం బేడవ, మనువు నఖిలలోకమాన్యయశుని.[3]

9


వ.

ఆవైవస్వతమనువున కిక్ష్వాకు నృగ దృష్ట శర్యాతి సరిష్యంత నభగ దిష్ట
కరూశ వృషధ్ధు లను కుమారులు తొమ్మండ్రు పుట్టి నానాద్వీపమండితం బైన
మహీమండలంబునకు రాజులైరి మఱియును.[4]

10


క.

ఆవైవస్వతుఁ డమ్మై, త్రావరుణులఁ గూర్చి కడుముదంబున భాగ్య
శ్రీ వెలసిన సంతతికై, కావించె నతండు పుత్రకామేష్టి తగన్.

11


తే.

అందు నపహుతమై హౌతృకాపచార, దోషవశమునఁ జేసి పుత్రుండు జనన
మొందనేరక కన్యక యుదయమయ్యె, నవ్య సౌందర్యవతి యిళానామమునను.[5]

12


వ.

పదంపడి యక్కన్య మిత్రావరుణప్రసాదంబునం జేసి సుద్యుమ్నుం డను కుమా
రుండై పెరుగుచుండి యౌవనమదంబున నెవ్వరిం గైకొనక యన్యపురుషులకు
దురవగాహం బైనగౌరీవనంబున విహరించుచుండ నలిగి యీశ్వరుండు తొల్లిం
టియట్ల స్త్రీరూపం బగునట్లుగా శాపం బిచ్చిన నయ్యింతి సోమసూనుం డైన
బుధునియాశ్రమంబునఁ బరిభ్రమించుచుండె నంత.[6]

13


సీ.

మగువకెమ్మోవికమ్మనితేనె లానంగఁ గలుగుట రసనంబు గలఫలంబు
నలినాస్యయాలింగనశ్రీలఁ దేలంగఁ గలుగుట దేహంబు గలఫలంబు
భామినీమణిమంజుభాష లాకర్ణింపఁ గలుగుట కర్ణముల్ గలఫలంబు
వనజాక్షిరూపలావణ్యసంపదఁ జూడఁ గలుగుట కన్నులు గలఫలంబు


తే.

ముదితతనుసౌరభంబులు మూరుకొనెడి, ఘనత గల్గుట నాసిక గలఫలంబు
నాకు ననుచును రోహిణీనందనుండు, సొంపుతోడ నిలాకన్యఁ జూచి చొక్కె.

14
  1. ఆరాధ్యుఁడు = ఆరాధింపఁదగినవాఁడు, హిరణ్యగర్భుఁడు = బ్రహ్మ, జగద్రక్షాగరిష్ఠాత్మకుండు = లోకమును రక్షించుటయందు మిక్కిలి గురుత్వమునొందిన మనసుగలవాఁడు, సృష్ట్యర్థంబుగాన్ = సృష్టికొఱకు.
  2. దివసకరుఁడు = సూర్యుఁడు.
  3. కమలహితుఁడు = సూర్యుఁడు, సాంప్రతంబు = ప్రకృతము - ఇప్పటిది.
  4. మండితము = అలంకరింపఁబడినది.
  5. అందు = ఆయిష్టియందు, అవహంతమై = (కూఁతురు పుట్టవలెనని మనుపత్ని కోరుటచేత) వ్యత్యస్తముగా హోమము చేయఁబడినదై, హౌతృక = హోతృసంబంధమైన - ఈయర్థమందు శ్లో. “తత్ర శ్రద్ధామనోః పత్నీ హోతారం సమయాచక, దుహిత్రర్థముపాగమ్య ప్రణిపత్య పయోవ్రతా, తేన హోత్రపచారేణ కన్యేశానామ సాభవత్" అని శ్రీశుభమహర్షిచేత శ్రీభాగవతంబునఁ జెప్పఁబడియున్నది.
  6. సోమసూనుండు = చంద్రునికొడుకు.