పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

శ్రీవిష్ణుపురాణము

పంచమాశ్వాసము



లక్ష్మీవల్లభకరు
ణాలంకృత భూమిమండలాఖండల శౌ
ర్యాలక్షితరపుహృదయక
రాళీకృతసుప్రతాప రాఘవభూపా.[1]

1


వ.

సకలపురాణవిద్యాధురంధరుం డైనపరాశరుండు మైత్రేయున కిట్లనియె నిట్లు
నావలన సమస్తంబును సవిస్తరంబుగా వింటి వింక వినవలయునవి యెట్టివి యని
యడిగిన నతం డిట్లనియె.

2


తే.

కీర్తిపెంపున దేవతామూర్తులైన, సూర్యసోమవంశంబుల క్షోణిపతుల
చరితములు వేఱువేఱు విస్తారఫణితి, వినఁగఁ గోరెడుఁ జిత్తంబు విప్రముఖ్య.

3

సూర్యచంద్రవంశపురాజులచరిత్రములు

వ.

అని రాజవంశకథాశ్రవణకుతూహలపరుండై యడిగిన మైత్రేయునకుఁ బరాశరుం
డిట్లనియె.

4


ఉ.

భానుసుధాకరాన్వయవిభాసితులై జగదేకవీరులై
యీనిఖిలంబునన్ వినుతి కెక్కినరాజులఁ జెప్ప నొప్పు వం
శానుచరిత్రముల్ వినిన యట్టివివేకికిఁ గల్గుఁ బుణ్యముల్
వానికి నెన్నఁడేనియును వంశవినాశము లేదు ధాత్రిలోన్.5 [2]

5


వ.

కావున ననేకవీరకుమారభూపాలాలంకృతం బైన మానవవంశంబులు ప్రతి
దినంబు విన ననేకపాపపంకప్రక్షాళనం బగునని యిట్లని చెప్పందొడంగె.[3]

6
  1. శ్రీలక్ష్మీవల్లభకరుణాలంకృత = శ్రీవిష్ణుదేవునియొక్క కృపచేత అలంకరింపఁబడినవాఁడా - శ్రీహరికరుణను పొందినవాఁడా, భూమిమండలాఖండల = భూమండలమునకు దేవేంద్రుఁడా - మహారాజా, శౌర్యాలక్షితరిపుహృదయకరాళీకృతసుప్రతాప = శూరత్యముచేత చక్కగా గుఱుతిడఁబడి శత్రువుల హృదయములందు భయంకరముగా (తోపింప)చేయఁబడిన మేలైన ప్రతాపము గలవాఁడా.
  2. భానుసుధాకరాన్వయవిభాసితులు = సూర్యచంద్రవంశములయందు ప్రకాశించువారు.
  3. పాపపంకప్రక్షాళనంబు = పాపములనెడు బురదను చక్కగా కడుగుట.