పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కాశిరాజునివాసంబునకు వచ్చి కన్యాంతఃపురంబునం బ్రవర్తించుచున్న నక్కన్య
యెఱింగి యత్యంతగౌరవంబునం బెంచుచున్నంత.[1]

343


ఆ.

జనకచక్రవర్తి జాహ్నవీతటమున, నశ్వమేధయజ్ఞ మాచరించి
ధర్మయుక్తి నపభృథస్నాన మాగంగ, యందుఁ జేయుచున్న యవసరమున.

344


క.

ఆపుణ్యకాలమున ధర, ణీపాలకపుత్రి తాను నెమలియునుం దే
వాపగలోపలఁ గ్రుంకెను, బాపంబులు వాయ బహుశుభంబులు గలుగన్.[2]

345


క.

ఆలోన నెమలి కతిపయ, కాలమునకుఁ గాలవశతఁ గలిగి జనకభూ
పాలునికిఁ బుత్రుఁడై గుణ, శీలవివేకముల నుల్లసిల్లుచుఁ బుట్టెన్.[3]

346


వ.

పుట్టి సంప్రాప్తయౌవనుండై పెరుగుచున్నంత కాశిరాజు తనకన్నియకు స్వ
యంవరోత్సవంబు సేయ సమకట్టి సకలరాజలోకంబులు రప్పించి కూఁతునకుం
జూపిన యప్పరమపతివ్రత పూర్వజన్మంబునం దనప్రాణవల్లభుం డైన జనకునికు
మారుని వరియించి యనేకకాలంబు దాంపత్యసుఖంబు లనుభవించె. వైదే
హుండును జాతిస్మరత్వంబు గలిగి మహాధర్మశీలుండై తండ్రిపిమ్మట సముద్రము
ద్రితవసుంధరాచక్రంబు నిర్వక్రంబుగం బాలించి కృతార్ధుండై యంతంబునం
గాంతాసమేతుండై విష్ణుసాయుజ్యంబునం బొందె అని పాషండసంభాషణ
దోషంబును నశ్వమేధంబున నపభృథస్నానవిశేషంబును బతివ్రతాగణ్యపుణ్యా
తిరేకంబునుం జెప్పి మఱియును.[4]

347


మ.

అనవేమక్షితిపాన్వయోత్తమ సముద్యద్వైభవోపేంద్ర కాం
చనభూమీధర ధైర్యశాశ్వతయశస్సంపన్న దైతేయశా
సనపూజాపరతంత్ర నామితరిపుక్ష్మాపాలకోటీర శాం
తనవప్రాభవ సత్కవీంద్రకవితాతాత్పర్య శౌర్యోన్నతా.[5]

348


క.

గుజ్జరిదట్టవిభాళ జ, గజ్జనసంస్తుత్య నిత్యకపటారివధూ
హృజ్ఙనితాప్రతితాప మ, రుజ్జప్రతిమానబల నిరూఢవివేకా.[6]

349
  1. వృకంబు = తోడేలు.
  2. దేవాపగ = దేవనది - గంగ.
  3. కాలవశత = చావు.
  4. సముద్రముద్రితవసుంధరాచక్రంబు = సముద్రముచే చుట్టఁబడిన భూమండలమును, నిర్వక్రంబుగన్ = ఏలోపమును లేక, అతిరేకము = అతిశయము.
  5. దైతేయశాసనపూజాపరతంత్ర = విష్ణుదేవుని అర్చించుటయందు ఆసక్తమైన ప్రవర్తనముగలవాఁడా, నామితరిపుక్ష్మాపాలకోటీర = చంపఁబడిన శత్రురాజులయొక్క కిరీటములు గలవాఁడా, శాంతనవప్రాభ = భీష్మునిశక్తివంటిశక్తి గలవాఁడా, సత్కవీంద్రకవితాతాత్పర్య = సత్కవిశ్రేష్ఠులయొక్క కవిత్వమునందలి తత్పరత్వము గలవాఁడా, శౌర్యోన్నతా = శూరత్వముచేత గొప్పవాఁడా.
  6. గుజ్జరిదట్టవిభాళ = ఇది బిరుదు పేరు, జగజ్జనసంస్తుత్య = లోకులచేత స్తుతింపఁదగినవాఁడా, నిత్యకపటారివధూహృజ్జనితాప్రతితాప = శాశ్వతమైన కపటశత్రువుల భార్యలహృదయములందు పుట్టించఁబడిన సరిలేని సంతాపము గలవాఁడా, మరుజ్జప్రతిమానబల = వాయుపుత్రుఁడైన భీమునిబలముతో సమానమైన బలముగలవాఁడా, నిరూఢవివేక = మిక్కిలి స్థిరపడిన తెలివిగలవాఁడా.