పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అంతఁ గొంతకాలంబునకు నారాజు పంచత్వంబు నొందె నయ్యిందువదనయు
నతనితోడన యగ్నిప్రవేశంబు చేసి జన్మాంతరంబున జాతిస్మరత్వంబు గలిగి సర్వ
విజ్ఞానసంపన్నయై కాశిరాజునకుం గన్యయై జన్మించి పెరుగుచుండె నారాజును
పాషండసంభాషణదోషంబున విదిశాపురంబునం గుక్కయై పుట్టిన.[1]

333


తే.

రాజబింబాస్య జాతిస్మరత్వమహిమ, వలనఁ దనజన్మమంతయుఁ దెలిసి ప్రాణ
నాథుఁ డెచ్చోట నేమియైనాఁడొ యనుచు, నాత్మఁ దలపోసి కుక్కపుట్టగుట దెలిసి.

334


ఆ.

తండ్రి పెండ్లి సేయఁ దలఁచిన నొల్లక, పిన్నతల్లిఁ జూచు ప్రేమతోడ
నిందువదన విదిశ కేతెంచి శునకమై, యున్న ప్రాణవిభుని నొనరఁ గాంచి.

335


ఆ.

అధికదుఃఖనిరత యగుచు నేకాంతమై, నపుడు ప్రాణనాథు నల్లఁ జేరి
పరమభక్తితోడఁ బ్రణమిల్లి యింతి యిట్లనియెఁ గరపయోకుహములు మొగిచి.

336


ఆ.

నిన్నువంటిపుణ్యనిరతుఁడు పాషండ, భాషణమున నైనపాతకమున
నిట్టియధమజాతిఁ బుట్టఁగఁ బాలయ్యె, తప్పఁ ద్రోయరాదు దైవఘటన.

337


తే.

నీవు జాతిస్మరత్వంబు నిశ్చయింప, లేక యజ్ఞానవృత్తి నీలీల నధమ
జాతి నున్నాఁడ వీపాటి చాలు నింక, నీశరీరంబు విడువంగదే మహాత్మా.

338


వ.

అని పరమోపదేశంబు చేసిన యప్పుణ్యవతితోడిసంభాషణంబునం జేసి యాశున
కంబు జాతిస్మరత్వంబున నిరాహారియై కతిపయదినంబులకు శరీరంబు విడిచి
కోలాహలం బనుపర్వతంబున నక్కయై పుట్టిన యేడుగాలంబునకును.

339


ఆ.

దివ్యదృష్టి నింతి తెలిసి యచ్చోటికి, నొక్కనాఁడు వచ్చి నక్కఁ జూచి
యల్ల కుక్కతోడ నాడినవాక్యంబు, లెల్ల నాడి మగుడ వేగుటయును.[2]

340


క.

ఆసగ్గారియుఁ బుణ్య, స్త్రీసంభాషణము దనకుఁ జెందినకతనం
జేసి వివేకజ్ఞానవి, కాసంబున నుల్లసిల్ల కాననభూమిన్.[3]

341


క.

ప్రాయోపవేశమునఁ దన, కాయంబు పరిత్యజించి గ్రక్కునఁ దోడే
లై యుదయించిన నచటికిఁ, బోయి యతివ తొంటియట్ల బోధించుటయున్.[4]

342


వ.

ఆవృకంబు పంచత్వంబు నొంది వెండియు వానరంబై పుట్టి యప్పుణ్యవతివచ
నంబువలన నప్పుట్టువు విడిచి కొక్కిరయై పుట్టి యారాజవదసహితోపదేశంబు
నం జేసి యాజన్మంబు విడిచి మయూరంబై పుట్టి వేఁటకారులచేతఁ బట్టువడి

  1. పంచత్వంబు = చావు, కన్య = కూఁతురు.
  2. దివ్యదృష్టిన్ = జ్ఞానదృష్టిచేత.
  3. సగ్గారి = సృగాలము - నక్క, కతనం జేసి = కారణముచేత.
  4. ప్రాయోపవేశము = చచ్చుతలఁపుతో ఆహారము మాని శయనించుట, కాయంబు = దేహము