పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బలశూన్యులై తారుదార వినాశంబు నొంది రప్పుడు దేవతలు పరమధర్మపరా
యణులును వేదమార్గవర్తులునై రాక్షసుల నశ్రమంబున సాధించి పూర్వప్రకా
రంబున యజ్ఞభాగంబు లుపయోగించుచు సుఖంబుండి రని చెప్పి మఱియును.[1]

322


క.

వేదములు విడిచి క్రతువులు, గాదని పోనాడి పైతృకంబులమేలున్
లేదని నాస్తికవిధి సం, పాదించినవాఁడు నగ్నపాషండుఁ డగున్.

323


మ.

నలి మీఱంగలబ్రహ్మచారి గృహి వానప్రస్థ యత్యాశ్రమం
బులలో నేమియు నొల్ల కాగమచయంబు న్నింద గావించుచున్
బలుదుర్మార్గము లెల్ల నిక్కములుగా పాటించుచున్ విష్ణుభ
క్తుల నిందించినవాఁడు నగ్నుఁ డని యెందుం జెప్పు వేదార్థముల్.[2]

324

శతధన్వుం డనురాజు పాషండసంభాషణదోషంబున శునకాదిజన్మంబులఁ బొందుట

తే.

అనఘ పాషండుఁ జూచిననబ్జమిత్రుఁ, జూడవలయును వానితోఁ గూడి మాట
లాడినను దుష్టజన్మంబులందుఁ బుట్టుఁ, జెలిమి చేసిన పాపంబు చెప్పరాదు.[3]

325


వ.

పాషండభాషణంబున నైనపాతకంబు తేటపడునట్టి కథఁ జెప్పెద వినుము.

326


క.

శతధనుఁ డనియెడుధరణీ, పతి తొల్లి భుజప్రతాపబంధురయశుఁడై
క్షితిఁ బాలించుచు ధర్మ, స్థితిఁ గ్రతువులు భక్తితోడఁ జేయుచునుండున్.[4]

327


తే.

అమ్మహీపతికులకాంత యధికసాధ్వి, సర్వలక్షణ సంపన్న సత్యశౌచ
వినయవిజ్ఞానరూపవివేకనిరత, శైభ్య యనునది పతిభక్తి సలుపుచుండె.[5]

328


వ.

అమ్మహీపతి కార్తీకమాసంబున నొక్కనాఁడు యజ్ఞంబు చేసి ధర్మపత్నీసహితుం
డై భాగీరథియందు నపభృథస్నానంబు చేసి తత్తీరంబున బ్రాహ్మణోత్తములకు
దక్షిణ లిచ్చుచున్నసమయంబున.[6]

329


క.

తనకు విలువిద్య మును చె, ప్పిన యాచార్యునిసఖుండు పీడావర్తుం
డనుపాషండుం డొకరుఁడు, చనుదెంచిన వానితోడ సంభాషించెన్.

330


తే.

వానిఁబొడ గని యారాజవనిత దొలఁగి, పోయి హరిచింత సేయుచుఁ దోయజాప్తుఁ
జూచి దోషవిముక్తయై క్షోణివిభుని, రాక గోరుచు నున్నంత రాజవరుఁడు.

331


క.

పాషండుని నీతిగౌరవ, భాషణములఁ దన్పి వానిఁ బన్పి ముదముతో
యోషిత్సమేతుఁడై పరి, తోషంబున వచ్చి గరిమతో మహి యేలెన్.[7]

332
  1. బహిష్కృతులన్ = వెలియైనవారిని, నూలుకొల్పినన్ = పురికొల్పఁగా, తారుదార = తమంతట దామే, ఉపయోగించుచున్ = అనుభవించుచు.
  2. నలి = బాగు.
  3. అబ్జమిత్రున్ = సూర్యుని, చెప్పరాదు = చెప్పశక్యముకాదు.
  4. బంధురము= అధికము.
  5. కులకాంత = భార్య.
  6. అపభృథస్నానంబు = యజ్ఞమున దీక్షాంతమందు చేయునట్టి స్నానము.
  7. యోషిత్సమేతుఁడు = భార్యతో గూడుకొన్ననాఁడు, పరితోషంబునన్ = అధికసంతోషముతో.