పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ధనుఁ బుట్టించి మురాంతకుఁ, డనిమిషవర్గములతోడ ననియె బ్రీతిన్.

301


తే.

ఈమహామహుఁ డసురులనెల్ల వేద, శాస్త్రబాహ్యులఁ జేసి పాషండకర్మ
ములకు నూల్కొల్పి పటుతేజమును బలంబుఁ, జెఱుచు నప్పుడే మీచేతఁ జెడుదు రరులు.[1]

302


వ.

అని నిర్దేశించి యద్దేవుం డంతర్ధానంబునం బొందె దేవగణంబులును మాయా
మోహసమేతులై క్రమ్మఱి నిజనివాసంబులకుం జని రంత నమ్మాయామో
హుండును.

303


తే.

బర్హిపత్రధరుండు విస్పష్టముండ, మ స్తకుండును మఱి దిగంబరుఁడు జైన
శాస్త్రశీలుండు నై సర్వజనులఁ దనదు, మాయఁ జొక్కించుచును గరిమంబుతోడ.[2]

304


తే.

నర్మదాతీరమునఁ దపోనవ్యవృత్తి, నెనయుదానవవిభులస్ననిధికిఁ బోయి
వరుస దీవించి వారిచే వలయుపూజ, లంది యుచితసల్లాపంబు లాచరించి.[3]

305


క.

అతిమధురము నతిశాంతము, నతివినయము నతిహితంబు నగునర్థములన్
బ్రతిభ గలవాక్చమత్కృతి, దితిజుల నీక్షించి పలికె దివిజులు పొగడన్.

306


క.

మీ రిహలోకసుఖంబులు, గోరియెు పరలోకసుఖము గోరియొ కడుదు
ర్వారగతి దపము సేసెద, రారసి నా కెఱుఁగఁజెప్పుఁడని పలుకుటయున్.

307


తే.

అనఘ మా కైహికములపై నాసలేదు, పరమపావనకైవల్యపదము నందఁ
జేయుచున్నార మీతపస్సిద్ధి మాకు, నగువిధం బెట్లు తెలియంగ నానతిమ్ము.[4]

308


వ.

అనిన నతం డిట్లనియె.

309


తే.

మీకు నావచనంబులమీఁదఁ బరమ, మైనవిశ్వాస మొదవినయట్లయేని
[5]యైహికాముష్మికములప్రయత్నమెల్ల, వివరముగ మీకుఁ జెప్పెద వినుఁడు తెలియ.[6]

310


తే.

బ్రతికియుండినయన్నాళ్లుఁ బరమసౌఖ్య, మైన యైహిక మగుఁ జచ్చినపుడె ముక్తి
నాఁగఁ బరలోక మనఁగ నెక్కడిది దీని, నరసి మీవంటిపురుషు లె ట్లరిగినారు.

311


క.

ఎంతతప మాచరించిన, నెంతవివేకమునఁ జదువు లెఱిఁగిన దైవం
బెంతగలదన్న నిన్నియు, భ్రాంతిజ్ఞానములు గాక పరమార్ధములే.

312


ఉ.

కావున వేదశాస్త్రములు గల్లలు యజ్ఞము లాచరించినన్
గోవధపాతకంబు సమకూరుట తథ్యము ముక్తిసౌఖ్యపుం

  1. బాహ్యుల = వెలియైనవారిని, పాషండకర్మములకున్ = వేదవిరుద్ధక్రియలకు, నూలుకొల్పి = ప్రేరేపించి.
  2. బర్హిపత్రధరుఁడు = నెమలిఱెక్కల ధరించినవాఁడు, ముండమస్తకుండు = బోడితలవాఁడు, చొక్కించుచు = పరవశత్వము నొందించుచు, గరిమంబుతోడన్ = గొప్పదనముతో.
  3. తపోనవ్యవృత్తిన్ = తపస్సుయొక్క అపూర్వమైన వర్తనమును, ఎనయు = పొందునట్టి.
  4. ఐహికములు= ఈలోకమునందలి సుఖములు.
  5. పరమపావననిర్వాణపదవిహార, విభవము కుపమఁ జెప్పెద వినుఁడు తెలియ. అని పాఠాంతరము.
  6. విశ్వాసము = నమ్మిక.