పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఇట్లు ప్రత్యక్షంబైన.

288


శా.

దేవేంద్రప్రముఖాఖిలామరవరుల్ దేదీప్యమానప్రభా
శ్రీవిభాజితమూర్తియై వెలుఁగు లక్ష్మీదివ్యవక్షస్స్థలున్
భావంబుల్ వికసింపఁ జూచి గరిమన్ భక్తిప్రణామంబు లి
చ్ఛావృత్తుల్ దళుకొత్తఁజేసి నుతిసేయం జొచ్చి రత్యున్నతిన్.[1]

289


లయగ్రాహి.

ఆదిపురుషోత్తమ యనాదినిధ నాసురని
                    షూదన సుఖామృతరసోదన రమాసం
పాదన మహోగ్రభవశాదశుచివాసరక
                    రోదయ వినమ్రజనఖేదహారణా ప్ర
హ్లాదహృదయస్థిత మహాదురితసంహరణ
                    వేదమయ దుర్జనవివాదహ జగత్ప్రా
ణాదరిపువాహన పయోదనిభగాత్ర సన
                    కాదిమునివంద్య కమలోదర నమస్తే.[2]

290


చ.

అనుచును బెక్కుచందముల నంబుజనాభునిఁ బ్రస్తుతించి యో
వనరుహనేత్ర భక్తజనవత్సల యోజగదీశ యేము వ
చ్చినపను లాదరించి విని చిత్తమునం గలయట్లు చేయవే
యనుచు వినమ్రవృత్తి నపు డయ్యమరావలి భక్తి నిట్లనున్.

291


ఉ.

ధీరత లోకముల్ వొగడ దేవర నాఁడు నృసింహమూర్తివై
భూరిబలున్ హిరణ్యకశిపుం బరిమార్చి నిలింపరాజ్యల
క్ష్మీరమణీయవైభవవిశేషము లింద్రుని కిచ్చినట్టియా
వైరము కారణంబుగ నవార్యబలోన్నతి చెంగలింపఁగన్.[3]

292


ఉ.

వానిసుతుండు హ్లాదుఁ డనువాఁడు భయంకరవీరదైత్యసే

  1. దేదీప్యమానప్రభాశ్రీవిభాజితమూర్తి = మిక్కిలి వెలుఁగుచున్న కాంతిసంపదచేత ఒప్పునట్టి ఆకృతిగలవాఁడు, ఇచ్ఛావృత్తులు = మనోవ్యాపారములు, తళుకొత్తన్ = ప్రకాశముకాఁగా.
  2. అనాదినిధన = జన్మనాశములు లేనివాఁడా, అసురనిషూదన = అసురులను చంపువాఁడా, సుఖామృతరసోవన = సుఖభావమైన అమృతరసమే అన్నముగాఁ గలవాఁడా - ఎల్లప్పుడు సుఖము ననుభవించువాఁడా అనుట. మహోగ్రభవశాదశుచివాసరకరోదయ = అతిభయంకరమైన పాప మనెడుబురదకు బరిశుద్ధత్వ మనెడు సూర్యోదయమైనవాఁడా, వినమ్రజనఖేదహరణా = మ్రొక్కినవారి దుఃఖమును పోఁగొట్టువాఁడా, వేదమయ = వేదస్వరూపుఁడా, దుర్జనవివాదహ = దుష్టులవాదును పోఁగొట్టువాఁడా, జగత్ప్రాణాదరిపువాహన = వాయుభక్షకములైన సర్పములకు పగవాఁ డగుగరుత్మంతుఁడు వాహనముగాఁ గలవాఁడా, పయోదనిభగాత్ర = మేఘమువంటి దేహముగలవాఁడా, నమస్తే = నీకొఱకు నమస్కారము.
  3. అవార్య = నివారింపరాని, చెంగలింపఁగన్ = అతిశయింపఁగా.