పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

వేద మభ్యసించి వేదమార్గంబులు, విడిచిపెట్టి దుర్వివేకబుద్ధి
బహుమతముల నడుచు పాషండుఁడే నగ్ను, డతనిఁ జూచి యర్థ మాడవలదు.[1]

281


వ.

నగ్నసంభాషణంబు లనేకపాతకహేతుభూతంబు లేతద్విషయం బైనయొక్క
యితిహాసంబు గలదు తొల్లి శంతననందనుం డైనభీష్మునకు మత్పితామహుం
డైనవసిష్ఠుండు వినిపించునప్పు డేను తెలివిపడ వింటి నత్తెఱంగు వినుము.[2]

282


ఉ.

పూర్వమునన్ హిరణ్యకశిపున్ గమలాక్షుఁడు నారసింహుఁడై
గర్వ మడంచి దేవతలఁ గాచిననాటివిరోధ మాత్మలో
నోర్వఁగలేక వానితనయుం డగుహ్లాదుఁడు దైత్యసేనతో
నుర్వియు నింగియుం బగుల నొక్కట నార్చుచు వచ్చి యుగ్రుఁడై.[3]

283


మత్తకోకిల.

నాకలోకముమీఁద ఘోరరణం బొనర్చిన భీతులై
పాశశాసనుఁ డాదియైనసుపర్వులందఱు దేవతా
నీకసేవితుఁ డైననీరదనీలవర్ణుని నుత్తమ
శ్లోకునిం బరముం బయోరుహలోచనున్ భజియించుచున్.[4]

284


మ.

చని దుగ్ధాంబుధియుత్తరంబున వళక్షద్వీపమధ్యంబునన్
ఘనచింతామణిశైలకందరమునన్ గల్పద్రుమోద్యానశో
భనదేశంబులయందు నుజ్జ్వలతపఃపారీణులై యుండి రా
వనజాతాక్షసహస్రనామపఠనవ్యాపారపారీణులై.[5]

285


తే.

కోరి యిబ్భంగి నత్యంతఘోరతపము, సేయుచుండంగఁ ద్రైలోక్యనాయకుండు
భక్తలోకైకరక్షణోపాయుఁ డగుచు, నతులకారుణ్యరసహృదయంబుతోను.[6]

286


పంచచామరము.

సముజ్జ్వలంబు లైనశంఖచక్రముల్ కరంబులం
దమర్చి పక్షివాహనంబునన్ బసిండిచీరతో
సమస్తదివ్యమౌనికోటి సన్నుతించి మ్రొక్కఁగా
రమావిభుండు వచ్చె నిర్జరవ్రజంబుపాలికిన్.[7]

287
  1. పాషండుఁడే = వేదనిందకుఁడే.
  2. ఇతిహాసంబు = పూర్వకథ.
  3. నింగి = ఆకాశము, ఒక్కటన్ = ఏకముగా, ఉగ్రుఁడు = భయంకరుఁడు.
  4. నాకలోకము = స్వర్గలోకము, ఘోరరణంబు = భయంకరయుద్ధము, పాకశాసనుఁడు = ఇంద్రుఁడు, సుపర్వులు = దేవతలు, దేవతానీకసేవితుఁడు = దేవతలసమూహములచేత సేవింపఁబడువాఁడు, నీరదనీలవర్ణునిన్ = మేఘమువంటి నల్లనిచాయగలవానిని, పరమున్ = అత్యుత్తముని, పయోరుహలోచనున్ = కమలములవంటి కన్నులుగలవాఁడైన శ్రీహరిని.
  5. దుగ్ధాంబుధి = పాలసముద్రము, పళక్షద్వీపము = తెల్లదీవి - శ్వేతద్వీపము, కందరమునన్ = గుహయందు, కల్పద్రుమోద్యానశోభనదేశంబులయందు = కల్పవృక్షములు గల ఉద్యానవనమునందలి పుణ్యప్రదేశములయందు, ఉజ్జ్వలతపఃపారీణులు ప్రకాశమానమైన తపస్సుచేత గట్టెక్కినవారు.
  6. త్రైలోక్యనాయకుండు = మూఁడులోకములయందలి ప్రాణులకు ప్రభువైనవాఁడు, భక్తలోకైకరక్షణోపాయుఁడు = భక్తులసముదాయమును ముఖ్యముగ రక్షించుటయందలి ఉపాయముగలవాఁడు.
  7. సముజ్జ్వలంబులు = మిక్కిలి వెలుఁగునవి, పసిండిచీరతోన్ = బంగారుపచ్చడముతో, నిర్జరవ్రజంబుపాలిన్ = దేవతలసమూహమువద్దకు.