పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రాద్ధయోగ్యాయోగ్యద్రవ్యప్రశంస

ఆ.

యవలు వడ్లు చామ లావాలు మినుములు, తిలలు పెనలు గోదుమలు ప్రియంగు
వులు వనంబులందుఁ గలయోషధులు మేలు, శ్రాద్ధకర్మములకు సంతరింప.[1]

272


క.

ఉలవలు కందులు కోద్రవ, ములు కంబులు రాజమాషములు ననుములు చో
ళ్లులు తమిఁదలు నూఁదరలును, గలవని యిడఁజనదు పైతృకమునకు నధిపా.[2]

273


ఆ.

మునగకాయ యుల్లి ముల్లంగి గుమ్మడి, కాయ నేతిబీఱకాయ పుచ్చ
కాయ నక్కదోసకాయ వట్రువసొర, కాయ గాదు శ్రాద్ధకర్మములకు.

274


ఆ.

గోఁగుకూర యీలకూర చెంచలికూర, తుంటికూర పొన్నగంటికూర
నల్లతోఁటకూర పుల్లబచ్చలికూర, శ్రాద్ధములకుఁ గాదు సంతరింప.[3]

275


ఆ.

గొఱియ మేఁక కడితి గోడిగ యెనుఁబెంటి, గార్దభములపాలు గావు పూతి
గంధఫేనిలములఁ గల్గినజలములు, గావు శ్రాద్ధములకు భూవరేణ్య.[4]

276


ఆ.

పాపకర్ము వేదబాహ్యుని నతిరోగిఁ, గుక్క నక్కఁ బిల్లిఁ గ్రోతి గోడి
గ్రామసూకరంబు గార్ధభంబును నగ్నుఁ, గాదు చూడఁ బైతృకంబునాఁడు.[5]

277


వ.

ఇవ్విధంబున శ్రాద్ధంబు యథాకాలయోగ్యంబుగా నాచరించిన మహాత్ములు కృత
కృత్యు లగుదు రని చెప్పిన సగరచక్రవర్తి కృతార్థుండై యౌర్వోపదిష్టమార్గం
బున సదాచారసంపన్నుండై సుఖంబుండె నని చెప్పిన మైత్రేయుం డిట్లనియె.[6]

278


తే.

అనఘ పైతృకదివసంబునందు నగ్నుఁ, జూచినను కడుదోషంబు సోఁకు ననుచు
నాకుఁ జెప్పితి నగ్నుఁ డనంగ నెట్టి, వాఁడు తెలియంగ నానతీవలయు ననిన.

279

నగ్నలక్షణము

ఉ.

ధీమతిఁ జిన్ననాఁ డఖిలదేవతలన్ భజియించి ఋగ్యజు
స్సామము లభ్యసించి బహుశాస్త్రపరాయణుఁడై మహీసురుం
డేమియు బుద్ధిలేక శ్రుతు లెంతయు నింద యొనర్చు వానిఁ బో
పామరుఁడైన నగ్నుఁడని పల్కిరి వేదవిదుల్ మునీశ్వరా.[7]

280
  1. ప్రియంగువులు = కొఱ్ఱలు.
  2. కోద్రవములు =ఆళ్లు, కంబులు = సజ్జలు, రాజమాషములు = అలసందెలు, చోళ్లు = నల్లరాగులు.
  3. సంతరింపన్ = సేకరింప
  4. గోడిగ = ఆఁడుగుఱ్ఱము, ఎనుఁబెంటి = బఱ్ఱె, పూతిగంధఫేనిలములన్ = చెడ్డకంపుగల కుంకుడుచెట్లవేళ్ల ఊటలయందు.
  5. నగ్నున్ = నియమపూర్వకముగ వేదశాస్త్రములను పఠించియు వేదముల నిందించునట్టి బ్రాహ్మణుని.
  6. ఔర్వోపదిష్టమార్గంబునన్ = ఔర్వునిచేత ఉపదేశింపఁబడిన చొప్పున.
  7. ధీమతిన్ = వివేకయుక్తమైన బుద్ధితో, భజియించి = సేవించి, పామరుఁడు = జ్ఞానహీనుఁడు, వేదవిదులు = వేదముల నెఱిఁగినవారు.