పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విశ్వదేవతలకు స్వర్ణపాత్రంబులను పితృదేవతలకు రజతపాత్రంబులను బెట్టి
యగ్నౌకరణంబులు దీర్చి హుతశేషాన్నంబు పితృపాత్రంబులం బెట్టి రక్షోఘ్న
మంత్రంబు లనుష్ఠించుచుఁ దనవలన సంపాదింపబడినయన్నంబును బాయసా
పూపసూపవ్యంజనంబులును వడ్డించుసమయంబున.[1]

264


తే.

అతిథి తనయింటి కన్నార్థి యగుచు వచ్చె, నేని విప్రులయనుమతి నెదురుపోయి
తోడుకొనివచ్చి సద్భక్తితోడ వారి, పఙ్క్తియందును విష్ణురూపముగఁ దలఁచి.

265


తే.

భోజనము సేయఁబెట్టిన భూవరేణ్య, పైతృకం బొప్పు సర్వసంపన్న మగుచు
నతిథి యపుడు తిరస్కృతుం డయ్యెనేని, బైతృకక్రియ వృథ యని పల్కె శ్రుతులు.

266


తే.

దేవతామూర్తి యగునట్టిదివ్యయోగి, వివిధభంగుల నజ్ఞాతవృత్తితోడ
నవనిఁ జరియించునట్టియభ్యాగతులను, బూజసేయక యుండినఁ బుణ్యహాని.[2]

267


తే.

రాజవల్లభ వేదశాస్త్రములయందు, వినవె “యభ్యాగత స్స్వయం విష్ణు” వనఁగ
నతిథిసంతర్పణము వెలియైనఁ బుణ్య, మేమి యున్నది యజ్ఞంబు లేల సేయ.[3]

268


వ.

ఇవ్విధంబున నభ్యాగతసమేతంబుగాఁ బైతృకంబు సేయునప్పుడు బ్రాహ్మణోత్త
ములు మౌనంబుతో యథేష్టంబుగా భుజియించినయనంతరంబ తదుచ్ఛిష్టసన్నిధి
యందు మంత్రపూర్వకంబుగా పితృపితామహప్రపితామహులకుఁ బిండదానం
బు చేసి పితృతీర్థంబునం దిలోదకంబు లిచ్చి పాణిప్రక్షాళనానంతరంబున బ్రాహ్మ
ణాశీర్వాదంబులు వడసి యథాక్రమంబున సత్కారంబులు చేసి వారి ననిచి
పుచ్చి వారియనుమతంబున వైశ్వదేవంబును బలిహరణంబును దీర్చి సకలబంధు
సమేతంబుగా భోజనంబు చేసి కృతార్థుండై యుండవలయు.[4]

269


తే.

పైతృకశ్రాద్ధ మొనరింపఁ బరమభక్తి, యు క్తిలేక దురాత్ముఁడై యుండెనేని
మాలఁడై పుట్టుఁ గోటిజన్మములయందు, ననుచుఁ బలుకుదు రార్యులు మనుజనాథ.

270


క.

సారంగము మనుఁబోతును, సైరిభమును గొఱియ దుప్పి శశము నకులమున్
వారిచరంబును మేఁకయు, నారయఁ బలపైతృకమున కర్హ మగుఁ జుమీ.[5]

271
  1. అగ్నౌకరణంబులు = అగ్నికార్యములు, రక్షోఘ్నమంత్రంబులు = రాక్షసనాశకము లైనమంత్రములను, అనుష్ఠించుచున్ = చెప్పుచు, పాయసాపూపసూపవ్యంజనంబులు = పరమాన్నము అప్పములు పప్పుకూరలును.
  2. వివిధభంగులన్ = నానావిధముల, అజ్ఞాతవృత్తితోడన్ = తెలియనివర్తనముతో.
  3. అభ్యాగత స్స్వయం విష్ణుః = అన్నార్థియై యెదురుకొని వచ్చినవాఁడు తాను విష్ణువు, సంతర్పణము = సంతుష్టి.
  4. యథేష్టంబుగాన్ = ఇష్టముచొప్పున, పితృతీర్థంబునన్ = బొటనవ్రేలికొననుండి, పాణిప్రక్షాళనాంతరంబునన్ = చేతులు కడుగుకొన్నపిమ్మట.
  5. సారంగము = జింక, సైరిభము కారుదున్నపోతు, శశము = కుందేలు, నకులము = ముంగిన, వారిచరము = చేఁప, పలపైతృకమునకున్ = మాంసము పెట్టి చేయు పితృకర్మకు.