పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తల విరియఁబోసికొని యొంటి వెలికివచ్చి, రాత్రి నిలుచుండఁ గాదండ్రు రాజముఖ్య.

241


క.

జగడము పెండ్లియుఁ దనతోఁ, దగుచోటులఁ జేయవలయుఁ దా నందఱతోఁ
బగగొని వర్తించినఁ గీ, డగుఁ గాని శుభంబు నొంద దనిరి మహాత్ముల్.

242


క.

బలవంతుతోడఁ బగయును, బలహీనునితోడఁ జేయు బంధుత్వముఁ దాఁ
గిలిధన మిచ్చియు నూరక, కలహమునకుఁ గాలుద్రవ్వఁగారాదు సుమీ.

243


ఆ.

కాలు కాలఁ దోమి కడుగుట వెండ్రుకల్, విడిచి త్రిప్పుకొనుట నడుచుచుండి
కూడు గుడిచి నీళ్లు గ్రోలుట నిలుచుండి, యాచమించు టొప్పదనిరి బుధులు.

244


ఆ.

వానయైన నెండవచ్చిన గొడు గవ, శ్యంబు వలయు రాత్రి యడవిలోనఁ
దిరుగునపుడు గుదియ ధరియింపవలయును, గాలఁ జెప్పు లిడక కదలరాదు.[1]

245


క.

కెలఁకులమీఁదను దూరము, బలుమఱుఁ జూడంగఁ జనదు పయనంబునఁ గో
డెలకాఁడి యంతద వ్వెడ, గలుగఁగ ముందఱను దృష్టి గదురగవలయున్.

246


వ.

ఇట్లు నీతిపరుండై నిజకులాచారం బైనధర్మంబు వదలక ధర్మార్థకామంబులయందు
సమదర్శియై పాపకర్మంబులు పరిహరించి సమస్తభూతంబులయందు స్నేహార్ద్ర
చిత్తుండై యరిషడ్వర్గంబునందు బద్ధుండు గాక సదాచారసంపన్నుండై సాత్వి
కంబు వదలక పరపీడయుఁ బరనిందయుఁ జేయక తనజీవనంబు సకలప్రాణిసంఘం
బులకు నవికారభూతంబుగాఁ ద్రికరణశుద్ధిగా వర్తించుపుణ్యపురుషుండు పుణ్య
లోకప్రాప్తుం డగు నని చెప్పిన నమ్మహీవల్లభుం డిట్లనియె.[2]

247


క.

భృగువంశోత్తమ నీచే, నగణితముగ వినఁగఁ గలిగె నఖిలము విశదం
బుగ నింక నాకు నపరం, బగుపైతృకకర్మకాండ మది వినవలయున్.[3]

248

పైతృకకర్మక్రమమును వివరించుట

వ.

అనిన భార్గవనందనుండు రాజనందనున కిట్లనియె.

249


తే.

పెద్దనిదురకు మాఁగన్ను పెట్టుచున్న, మానవునిఁ దెచ్చి దక్షిణమస్తకంబు
గా మహీశయ్య నునిచి యుత్క్రాంతిదాన, మవనిదేవోత్తమున కొక్కయావు నిచ్చి.[4]

250


తే.

అచ్యుతానంతగోవింద యనుచుఁ బద్మ, నాభునామత్రయోచ్చారణంబు చేసి

  1. గుదియ = దుడ్డుగఱ్ఱ.
  2. సమదర్శి = ఎచ్చుతక్కువలు లేక చూచువాఁడు, పరిహరించి = విడిచి.
  3. అగణితముగన్ = లెక్కలేక, పైతృకకర్మకాండము = పితృసంబంధమైన కర్మములసమూహము.
  4. పెద్దనిదురకున్ = చావునకు, మాఁగన్ను పెట్టుచున్న మానవునిన్ = కన్నులు తేలవేయుచున్న మనుష్యుని, మస్తకము = తల, మహీశయ్యన్ = నేలమీఁదను, ఉత్క్రాంతిదానము = ప్రాణము పోవుటను గుఱించినదానము, అవనిదేవోత్తమునకున్ = బ్రాహ్మణశ్రేష్ఠునికి.