పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కారంబుగా నొనర్చునది విశేషజాతులకు బ్రహ్మోపదేశంబైన యుపనయనక్రియా
కలాపంబులు వేదోక్తమార్గంబున నిర్వర్తించి వేదాధ్యయనతత్పరుం డగుచు.[1]

177


మ.

చతురామ్నాయరహస్యవేది యగుచున్ శాస్త్రజ్ఞుఁడై నిర్మల
ప్రతిభోద్రిక్తమనస్కుఁడై యతికృపాపారీణుఁడై సంతత
వ్రతసంపన్నగరిష్ఠుఁడై గుణగణావష్టంభుఁడై సత్కళాం
చితుఁ డైనట్టిగురున్ భజింపవలయు శిష్యుండు సద్భక్తితోన్.[2]

178


క.

గురుశుశ్రూష యొనర్చుచు, సరసత్వముతోడ శ్రుతులు చదువుచు నిగమా
ర్థరహస్యంబులు దెలియుచుఁ, జరితార్థుం డగును బ్రహ్మచారి నరేంద్రా.

179


వ.

యథోక్తప్రకారంబున గురుదక్షిణ యొసంగి యమ్మహాత్మునిచేత ననుజ్ఞాతుండై
సంకల్పపూర్వకంబుగా గృహస్థవానప్రస్థయత్యాశ్రమంబులయందు నిష్టంబైన
యాశ్రమంబు నడుపవలయు. విశేషించియు గృహస్థాశ్రమంబు సమస్తాశ్రమం
బులకు నాశ్రయంబు గాన నమ్మహనీయపథంబునకు నభిముఖుండై.[3]

180

సదసత్కన్యకాస్వరూపనిరూపణము

తే.

అనఘ తనవయసునఁ దృతీయాంశమైన, ప్రాయమునఁ గలకన్నియఁ బరమసాధ్వి
నుభయకులములఁ దనయట్ల యొప్పుదానిఁ, బెండ్లియాడంగవలయు సంప్రీతితోడ.[4]

181


సీ.

నైసర్గికాంగహీనను శోఫి నతికేశఁ గేళహననతివఁ గృష్ణవర్ణ
రోమాంగిఁ గులటను రోగిని దుష్టాత్మ దుష్టవాత్సల్య నికృష్టవృత్తి
నధికపింగళ వినయాచారహీన మాతాపితృప్రతికూలఁ బాపహృదయ

  1. నిర్వర్తించి = నడపి.
  2. చతురామ్నాయరహస్యవేది = నాలుగువేదములయందలి రహస్యార్థముల నెఱిఁగినవాఁడు, నిర్మలప్రతిభోద్రిక్తమనస్కుఁడు = కళంకములేని సమయోచితన్ఫురణ గలబుద్ధిచేత అతిశయించిన మనసుగలవాఁడు, అతికృపాపారీణుఁడు = మిక్కుటమైన దయచేత పూర్ణుఁడు, సంతతవ్రతసంపన్నగరిష్ఠుఁడు = ఎడతెగనినియమములకలిమి గలవారియందు గొప్పవాఁడు - ఎల్లప్పుడు సద్వ్రతములు తప్పక నడపువాఁడు, గుణగణావష్టంభుఁడు = మంచిగుణములయొక్క సమూహములకు అవలంబమైనవాఁడు - ఎల్లమంచిగుణములు గలవాఁడు, భజింపవలయున్ = సేవించవలెను.
  3. యథోక్తప్రకారంబునన్ = శాస్త్రమునందు చెప్పఁబడిన చొప్పున, ఆశ్రయము = ప్రాపు, అమ్మహనీయ పథంబునకున్ = ఆగొప్పమార్గమునకు.
  4. వయసునన్ = ప్రాయమునందు, తృతీయాంశము = మూడింట నొకపాలు, ఉభయకులములన్ = తల్లివంశముచేతను తండ్రివంశముచేతను.