పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వినుతార్థరహస్యంబులు, వినిపించెద మేర్పడంగ విను మతిభక్తిన్.[1]

170


ఆ.

ధర్మపత్నియందుఁ దనకు జన్మించిన, సత్సుతునకుఁ దండ్రి జాతకర్మ
ములు యథాప్రకారముగఁ జేసి నాందీము, ఖాఖ్యమైనశ్రాద్ధ మాచరించి.

171


తే.

యుగ్మసంఖ్యాకు లగుభూసురోత్తముల సు, ఖాసనములయందుఁ బూర్వాభిముఖులఁ
గా నమర్చి యభీష్టప్రకారములను, భోజనమ్ములు సేయించి పూజ చేసి.[2]

172


ఆ.

యవలు పెరుగు తవుడు నాదిగాఁ గలపదా, ర్థములచేత హోమ మమర రెండు
కాలముల నొనర్పఁ గావలయును బ్రహ్మ, తీర్థమునను దేవతీర్థమునను.[3]

173


తే.

పదునొకండవనాఁడు భూపాలచంద్ర, పురుడు వెడలంగ సంతతాభ్యుదయమైన
మంగళస్నాన మొనరించి మందిరమున, శుద్ధిపుణ్యాహవాచన జోక సేసి.[4]

174


ఆ.

తనకుఁ బెద్దలైన తాతలదండ్రుల, పేరు లొండె గురులపేరు లొండెఁ
దగినయిష్టదేవతల పేరు లొండెను, దండ్రి నామ మిడఁగఁ దగు సుతునకు.

175


సీ.

అర్థహీనంబులు నపశబ్దములు నప్రశస్తంబులును జుగుప్సాసమేత
ములు నమంగళవర్ణములు నతిదీర్ఘాక్షరంబులు గోపాక్షరములు సర్వ
గురువులు సర్వలఘువులు నతిక్రూరములు గాక యెల్లవారలకుఁ బ్రియము
నతిముదంబును జేయునట్టి సమాక్షరయుక్తంబుగా నామ మొసఁగవలయు


తే.

ధారుణీసురులాదివిధానశబ్ద, వాచ కాంతంబులను శర్మవర్మగుప్త
దాసు లనుప్రత్యయంబులఁ దగ నొనర్ప, వలయునని వేదములయందుఁ బలికె నజుఁడు.[5]

176


వ.

వఱియు యథాకాలయోగ్యంబు లైనసమస్తకర్మంబులు నాయావర్ణధర్మప్ర

  1. వినుతార్థరహస్యంబులు = పొగడఁబడిన విషయములయొక్క రహస్యములును.
  2. యుగ్మసంఖ్యాకులు = జంటలెక్కగలవారు.
  3. బ్రహ్మతీర్థమునన్ = పెద్దవ్రేలి మొదటనుండియు, దేవతీర్థమునన్ = వ్రేళ్లకొనలయందుండియు.
  4. సంతతాభ్యుదయము = ఎప్పుడును మేలుగలది, జోక = బాగుగా.
  5. అప్రశస్తములు = అయుక్తములు - లజ్జాకరములు, జుగుప్ప = రోఁత, అమంగళవర్ణములు గలవి, కోపాక్షరములు = కఠినవర్ణములు గలవి, సర్వగురువులు = అన్ని గుర్వక్షరములుగానే యుండునవి, ధారుణీసురులాది = బ్రాహ్మణులాదిగా - బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రక్రమముగా, విధాన = విధ్యుక్తముగా, శబ్దవాచకాంతంబులన్ = నామవాచకశబ్దాంతములయందు, శర్మవర్మగుప్తదాసులు = శర్మ వర్మ గుప్తుఁడు దాసుఁడు, అనుప్రత్యయంబులన్ = అనునట్టి ప్రత్యయములను, తగన్ = యుక్తమగునట్లు, ఒనర్పవలయు = చేయవలెను - అనఁగా బ్రాహ్మణనామమునకు శర్మయనియు, క్షత్రియనామమునకు వర్మయనియు, వైశ్యనామమునకు గుప్తుఁడు అనియు, శూద్రనామమునకు దాసుఁడు అనియు కడపట ప్రత్యయరూపముగా చేర్చవలెనని తాత్పర్యము.