పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నుభయకులశుద్ధు విజతేంద్రియుని మహాత్ము, నరసి యతనికి శిష్యుఁడై యధికభక్తి.[1]

146


ఉ.

సమ్మద మొప్పఁగా వినయసమ్మదముల్ దళుకొత్త గోత్రనా
మమ్ములు చెప్పి సాగిలి నమస్కృతిఁ జేసి తదాజ్ఞతోడ ని
త్యమ్మును సేవ చేసి తనయందుఁ బ్రసన్నత గల్గియున్నచో
నమ్మహనీయుచేత శ్రుతు లభ్యసనం బొనరించు టొప్పగున్.[2]

147


చ.

గురువుల కెన్నఁడేని బ్రతికూలము లాడక సాధువృత్తితో
బెరయుచుఁ దోడిశిష్యులకుఁ బ్రీతి యొనర్చుచు నమ్మహాత్ముపై
నెరవును నేవయున్ విడిచి యెక్కువతక్కువ లైనసేవలం
బొరయక వేదముల్ చదువఁ బూనిన మేలగు బ్రహ్మచారికిన్.[3]

148


క.

స్నానము సంధ్యయు జపమును, మానక హోమంబు రేపు మాపు నడిపి క
ర్మానుష్ఠానపరాయణుఁ, డై నిత్యముఁ జదువు టుచిత మగు వేదంబుల్.

149


క.

తన గురుమతమున భిక్షా, శనము భుజించుచును సాధుజనమార్గముచే
నొనరిన వ్రతములు సేయుచు, ననఘా వేదములు చదువ నగు వడువునకున్.[4]

150


తే.

పత్రభాజనములును సంపన్నకంద, మూలములు సమిధలు జలంబులు ఫలంబు
లును మొదలుగాఁగ వదలక యనుదినంబు, నిచ్చి గురుకృప వేదంబు లెఱుఁగవలయు.

151


క.

ఆచార్యునిసమ్ముఖమున, నీచగతి మెలంగి వినయనిపుణతఁ దత్కా
లోచితసేవాపరుఁడై, యేచిన వేదములు శిష్యుఁ డెఱుఁగఁగవలయున్.[5]

152


వ.

ఇవ్విధంబున బ్రహ్మచర్యాశ్రమంబున వేదాధ్యయనంబు చేసి గురుదక్షిణ యథా
శక్తిపూర్వకంబుగా నొసంగి యాచార్యుచేత ననుజ్ఞాతుండై విధివంతంబుగా
దారపరిగ్రహంబు చేసి ధర్మమార్గంబున నర్థం బుపార్జించి శక్త్యనుసారంబుగ
గృహస్థధర్మంబులు నడుపుచు సత్పుత్రులం బడసి పితృఋణంబును యజ్ఞంబులం
జేసి దేవతలఋణంబు నధ్యయనంబుచేసి మునీంద్రులఋణంబును బలిహరణా
దులచేత భూతములఋణంబునుం దీర్చి వాత్సల్యంబున సకలలోకంబులను
సంతోషింపంజేయుచు.[6]

153


సీ.

సన్న్యాసులును బ్రహ్మచారులు వేదవిద్యార్థులుఁ దీర్థయాత్రాభిముఖులుఁ
బరసులై భూమిఁ దిరిగెడువారును గతిలేక యాఁకటఁ గ్రాఁగువారు

  1. వేదశాస్త్రపురాణార్థవేదిన్ = వేదములయొక్కయు శాస్త్రములయొక్కయు పురాణములయొక్కయు యర్థములను తెలిసినవానిని, విగతరాగున్ = పోయిన విషయానురాగము గలవానిని, గుణవంతున్ = ఎల్ల సద్గుణములు గలవానిని, ఆగమజ్ఞు =ఆగమములను తెలిసినవానిని, ఉభయకులశుద్ధున్ = తల్లిదండ్రు లైనయుభయులయొక్క వంశములవలన పరిశుద్ధుఁడైనవానిని, విజితేంద్రియుని= గెలువఁబడిన యింద్రియములు గలవానిని.
  2. అభ్యసనము = అభ్యానము.
  3. బెరయుచున్ = చేరుచు, ఎరవు = భేదము, ఏవ = జుగుప్స - రోత, పొరయక=పొందక.
  4. వడువు = వడుగు - బ్రహ్మచారి.
  5. నీచగతిన్ = తక్కువైనవిధమున, ఏచిన = అతిశయించిన.
  6. అనుజ్ఞాతుఁడు = అనుజ్ఞను పొందినవాఁడు, దారపరిగ్రహంబు చేసి = పెండ్లి చేసికొని, ఉపార్జించి = సంపాదించి.