పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లోకములు మెచ్చ నభిమతలోకములకుఁ, బోవు నాభూమిపాలుఁడు భూవరేణ్య.[1]

139


సీ.

బ్రాహ్మణక్షత్రియోపాస్తి దప్పక శ్రుతు లభ్యసించుచు దాన మర్హవృత్తి
నొసఁగుచుఁ బరధనం బొల్లక నిత్యనైమిత్తికక్రియలను మేర చెడక
నిర్మలానుష్ఠానకరుఁడై క్రయవిక్రయములందు నెంతయు విమలుఁ డగుచు
ధర్మమార్గమున నర్థముఁ గూడఁబెట్టుచు వ్యవహారపరిశుద్ధవర్తి యగుచుఁ


తే.

బైరు వాణిజ్యమును బశుపాలనంబు, వదలకుండంగవలయును వైశ్యవరుని
కనుచు లోకపితామహుం డాదియందుఁ, బలికె వేదార్థసరణిగాఁ బార్థివేంద్ర.[2]

140


సీ.

వసుధామరక్షత్రవైశ్యజాతులకు శుశ్రూషలు గావించుచును గులోచి
తాచారనియతాత్ముఁడై పంచయజ్ఞంబు లాచరించుచుఁ బాత్ర మరసి దాన
మొనరించుచును సర్వజనులయందును బ్రీతికారవాత్సల్యతాకలితుఁ డగుచుఁ
బరనిందయును నాత్మపౌరుషస్తుతియును జేయక తనచేయుసేవవలన


తే.

నఖిలజనములు ప్రియమందునట్టిమహిమ, గలిగి ఋతుకాలములయందుఁ గాంత గవిసి
నిష్ఠనుండుట సచ్ఛూద్రునికి మతంబు, చేసెఁ బద్మాసనుఁడు పూర్వసృష్టియందు.

141


ఉ.

మైత్రియు సత్యమున్ దయయు మంచితనంబును మాయలేమియుం
బాత్ర మెఱింగి యిచ్చుటయుఁ బ్రాణులయందు సమత్వమున్ గుణా
మిత్రతయుం బ్రశాంతమును మేళనమై విలసిల్లుబ్రాహ్మణ
క్షత్రియవైశ్యశూద్రులకు సంతతమున్ ధరణీతలేశ్వరా.[3]

142


తే.

ఎంతదురవస్థ వచ్చిన నెంతగీడు, గల్గియుండిన నెన్నివిఘ్నంబు లైనఁ
దనకులాచారమార్గముల్ దప్పనడుచు, టనుచితం బని చెప్పెఁ బద్మాసనుండు.

143


వ.

అని యిట్లు వర్ణాశ్రమధర్మంబు లుపన్యసించి యాశ్రమంబులు చెప్పువాఁడై
భృగువంశసంభవుండు కాకుత్స్థవంశసంభవున కిట్లనియె.

144


తే.

బాలకుం డుపనీతుఁడై బ్రహ్మచర్య, మాచరింపంగఁ బూని వేదాధ్యయనము
గోరి తనభక్తియుక్తి నెక్కొనినయట్టి, గురువు నత్యంతశాంతు సద్గుణవిశాలు.

145


తే.

వేదశాస్త్రపురాణార్థవేది విగత, రాగు గుణవంతు నానావిధాగమజ్ఞు

  1. ధర్మి = ధర్మముచేయువాఁడు, త్రివర్గపరతన్ = ధర్మార్థకామములయం దాసక్తి కలిగినతనముచేత, పార్థివునకున్ = రాజునకు.
  2. ఉపాస్తి = ఉపాసన - అర్చన, నిత్యము = ప్రతిదినము తప్పక చేయవలసినది, నైమిత్తికము = ఏదేనినిమిత్తముచేత పితృదేవతాదుల నుద్దేశించి చేయవలసినది, మేర = మర్యాద - క్రమము, సరణి = మార్గము.
  3. మాయ = వంచన, మేళనము = కలగలుపు.