పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ర్థంబులుగా విచారింపుము వాసుదేవారాధనతాత్పర్యహృదయులై యుండు
వారికి నరకలోకంబులు నుద్దండదండధరదండనంబులును లేవు విను మన
మైత్రేయుం డిట్లనియె.[1]

126


తే.

అనఘ సంసారవిజిగీషు లగుమహాత్ము, లాదిదేవు ననంతుని నవ్యయాత్ము
నిందిరానాథు భజియించి యెట్టిఫలము, లందుదురు నాకుఁ దెలియంగ నానతిమ్ము.[2]

127


క.

అనవుడుఁ బరాశరుం డి, ట్లను సగరుఁడు దొల్లి యేతదర్థము నౌర్వుం
డనుదివ్యయోగి నడిగిన, వినిపించె నతండు లోకవిస్పష్టముగన్.

128


వ.

అది యెట్లనిన నిక్ష్వాకుకులసంభవుం డైనసగరచక్రవర్తి భార్గవుం డైనయౌర్వు
కడకుం జని నమస్కరించి యిట్లనియె.

129


తే.

భూసురోత్తమ విను మహాపురుషులకును, మాధవారాధనోపాయమహిమ యెట్టు
లమ్ముకుందుని భజయించు నమ్మహాత్ము, లేమిఫలములఁ బొందుదు రెఱుఁగవలయు.

130


వ.

అనిన నౌర్వుం డిట్లనియె.

131


తే.

వసుమతీశ మనోరథవర్గమైన, భౌమమైనను నాకసంప్రాప్తియైన
మోక్షమైనను గాంతు రబ్జాక్షుఁ గొలిచి, కోరినట్ల ఘనంబైనఁ గొంచెమైన.[3]

132


క.

తమతమవర్ణాశ్రమధ, ర్మములయెడ నిరతు లైనమనుజులచేతన్
గమలాక్షుఁ డగుముకుందుఁడు, బ్రమోదమతియై యభీష్టఫలముల నొసఁగున్.[4]

133


తే.

యజ్ఞకర్మాదివిధులచే యాజ్యుఁ డగును, జపవిధేయులచేతను జప్యుఁ డగును
దూషకులచేత నత్యంతదూష్యుఁ డగుఁ బ, యోజనాభుండు భూతమయుండు గాన.[5]

134


సీ.

పరధనంబుల కాసపడక పరస్త్రీలఁ దలఁపక జీవహింసలకుఁ జొరక
యొకరిఁ గోపించి తిట్టక సాధుజనులకుఁ గీడు సేయక తనతోడ నెమ్మి
గలవారియెడ దురాగ్రహము వాటింపక గురుజనంబులయెడఁ బరమభక్తి
వదలక సకలదేవబ్రాహ్మణోపాస్తి విడువక రిపునైనఁ గొడుకునైన


తే.

నాత్మయట్లు పాలించి వర్ణాశ్రమక్ర, మమున నియతాత్ములై శాస్త్రమార్గములను
ధీరులై యున్న వారిచే దేవదేవుఁ, డగుముకుందుండు పూజితుం డగుచు నుండు.[6]

135
  1. పరిగ్రహంబు = కైకోలు - అంగీకారము, దురితమతులు =పాపబుద్ధులు, సకలశోభనకల్యంబు = ఎల్లమేలులను దెలుపునది, దుర్గమంబు = పొందరానిది, వైవస్వతుండు = యముఁడు, పద్మయోనివలనన్ = బ్రహ్మవలన, ఉద్దండ = ఉద్ధతమైన.
  2. విజిశేషులు = జయింపనిచ్ఛయించువారు.
  3. భౌమము = భూసంబంధియైనది, నాకసంప్రాప్తి = స్వర్గప్రాప్తి.
  4. ప్రమోదమతి = సంతోషించిన మనసు గలవాఁడు.
  5. యాజ్యుఁడు = యజింపఁదగినవాఁడు - యజ్ఞమునందు పూజింపఁదగినవాఁడు, జప్యుఁడు = జపింపఁదగినవాఁడు, భూతమయుండు = సర్వజీవస్వరూపుఁడు.
  6. నెమ్మి = స్నేహము, ఆత్మయట్లు = తనవలె, పూజితుండు – పూజింపఁబడినవాఁడు.