పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లై యతిప్రియవాక్యు లైనట్టివారి, హృదయములయందు వర్తించు నీశ్వరుండు.[1]

119


క.

హరికరుణవలనఁ బొదలిన, పురుషుం డత్యంతసౌమ్యమున విలసిల్లున్
సరస మగుభూమిఁ బుట్టిన, ధరణీరుహ మెలమిఁ బొంది తనరినభంగిన్.[2]

120


చ.

యమనియమాదియోగనియతాత్ముల నిర్గతమానమత్సరో
ద్యములఁ బరాంగనాజనపరార్థపరాఙ్ముఖులన్ సమస్తధ
ర్మమయుల సర్వలోకజనమాన్యుల నచ్యుతపాదపద్మస
క్తమతులఁ జేరఁబోవకుము ధన్యులు వారలు గానఁ గింకరా.[3]

121


తే.

శంఖచక్రగదాభయచారుహస్తుఁ, డైనయావాసుదేవుని నాత్మఁ దలఁచు
వారి కెన్నఁడు మనవంటివారు వెఱతు, రంధకారంబు నిలుచునే యర్కునెదుర.

122


ఆ.

ప్రాణిహింస చేసి పరులయర్థము గొని, యనృతనిష్ఠురోక్తు లాడి యశుభ
కర్మనిరతుఁ డైనదుర్మతి కతిదూరుఁ, డగుచు నుండు విష్ణుఁ డనుదినంబు.[4]

123


ఆ.

ఒరులకలిమి చూచి యోర్వక సుజనుల, నింద చేసి యధికనీచకర్ము
లైనయధములకు ననంతుఁడు కడుదూర, వర్తి యగుచు నుండు వసుధయందు.[5]

124


ఆ.

అధికదుష్టచిత్తుఁడై యర్థతృష్ణతో, మిత్రబంధుసుతకళత్రమాతృ
సహజపితృధనములు చౌర్యంబు గావించు, నతనియందు విష్ణుఁ డలిగియుండు.[6]

125


వ.

కావున విష్ణుపరిగ్రహంబు లేనిదురితమతులు మనవలని యతిక్రూరదండంబునకు
నర్హులు పరమవైష్ణవులకు సకలశోభనకల్యం బగుకైవల్యంబు గాని మనలో
కంబు దుర్గమంబు. అని యిట్లు వైవస్వతుండు భీష్ముం డనుకింకరునకుం జెప్పిన
విధంబు పద్మయోనివలన నకులుం డెఱింగెఁ దదీయవృత్తాంతం బేను గాళింగున
కుపన్యసించిన నతండు గృతార్థుండై పోయెం గావున నీవు నీయర్థంబులు యథా

  1. అమలహృదయవిమత్సరులు = నిర్మలమైన మనస్సుచేత మత్సరము లేనివారు.
  2. పొదలిన = వృద్ధిపొందిన, సౌమ్యమునన్ = తిన్నఁదనముచేత, ఎలమి =వికాసమును, తనరినభంగిన్ = వృద్ధిఁ బొందినట్లు.
  3. నిర్గతమానమత్సరోద్యములన్ = పోయిన గర్వముయొక్కయు చలముయొక్కయు పూనికగలవారిని, పరాంగనాజనపరార్థపరాఙ్ముఖుల = అన్యస్త్రీలయందును అన్యులధనమునందును మాఱుమొగముగలవారిని, సమస్తధర్మమయులన్ = ఎల్లధర్మములును స్వరూపముగాఁ గలవారిని, సర్వలోకజనమాన్యులన్ = ఎల్లలోకములలోని ప్రజలచేతను గౌరవింపఁదగినవారిని, అచ్యుతపాదపద్మసక్తమతులన్ = విష్ణుపాదకమలములయం దాసక్తిగలమనసు గలవారిని.
  4. అర్థము =ధనము, అనృతనిష్ఠురోక్తులు = అసత్యములును కఠినములు నైనమాటలను, అనుదినంబు = ప్రతిదినము - ఎల్లప్పుడును.
  5. దూరవర్తి = దూరముగా నుండువాడు.
  6. అర్థతృష్ణన్ = ధనమునందలి యాశచేత, చౌర్యంబు = దొంగతనము.