పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వలయు నీచేత ననిన నావనజహితుఁడు, గరుణ దైవాఱఁ గతిపయకాలమునకు.[1]

93


వ.

పరమరహస్యం బైనశుక్లయజుర్వేదంబు చదివించె నవ్వేదంబు పదియేనుదెఱం
గులై వాజిశాఖ లనం బ్రసిద్ధంబు లయ్యె నాశాఖలు కణ్వాదిమహామునుల
చేత నభ్యస్తంబు లయ్యె మఱియును.[2]

94


క.

జైమినీముని తా నేర్చిన, సామమునకు బహుసహస్రశాఖలు గలుగం
గా ము న్నొనర్చి శిష్యుల, చే మూడుజగంబులందుఁ జెలఁగఁగఁజేసెన్.[3]

95


క.

ఆది సుమంతుఁ డధర్వణ, వేదము బహుసంహితలుగ విరచించి మనో
మోదమున శిష్యవరుల స, మాదరమున నభ్యసించు నట్లుగఁ జేసెన్.

96


వ.

మఱియు వేదవ్యాసశిష్యుం డైనసూతుండు సకలపురాణంబులు నాఖ్యానోపా
ఖ్యానంబులు నేర్పడునట్లుగాఁ దనశిష్యు లైనసుమతియు నగ్నివర్చుండును
మిత్రుండును శంఖపాలుండును కృతవ్రణుండును సావర్ణియు ననునార్వుర
చేతం జదివించిన.

97


క.

వా రఖిలద్వీపంబులఁ, బౌరాణికులై యనేకభంగుల గీర్వా
ణోరగనరకిన్నరదే, వారులలోకములఁ జదివి రధికప్రీతిన్.[4]

98

అష్టాదశపురాణముల యనుక్రమణికయు, చతుర్దశవిద్యల తెలివిడియు

మ.

భువి బ్రహ్మాండము వామనంబు గరుడంబున్ స్కాందమున్ గూర్మభా
గవతాగ్నేయకమాత్స్యలైంగములు మార్కండేయమున్ బాద్మవై
ష్ణవశైవంబులు నారదీయము భవిష్యద్బ్రహ్మకైవర్తది
వ్యవరాహంబులు నాఁ బురాణములు ముయ్యాఱయ్యె విప్రోత్తమా.[5]

99


వ.

అవి సర్గప్రతిసర్గవంశమన్వంతరవంశానుచరితంబు లనుపంచలక్షణంబులం జెప్పఁ
బడియుండును.

100


ఆ.

ఏను నీకు నిప్పు డెఱిఁగించుచున్నవై, ష్ణవపురాణ మఖిలజగములందు
వేదసమ్మతంబు వివరించి చెప్పఁగాఁ, బడుటఁ జేసి చాలఁ బ్రభవహించె.[6]

101


వ.

మఱియును వేదంబులు నాల్గును వేదాంగంబు లాఱును మీమాంసయును
న్యాయశాస్త్రంబును ధర్మశాస్త్రంబును సకలపురాణజాలంబును జతుర్దశవిద్య
లయ్యె నివియును నాయుర్వేదంబును ధనుర్వేదంబును నీతిశాస్త్రంబును నర్థ
శాస్త్రంబునుంగూడఁ బదునెనిమిదివిద్యలని చెప్పంబడి బ్రహ్మర్షిదేవర్షిరాజర్షుల
చేత నుపన్యసింపంబడు ననిన మైత్రేయుం డిట్లనియె.[7]

102


క.

నా కిపుడు మీరు చెప్పిన, యీకథ లన్నియును వింటి నింకను సుగుణ

  1. దైవాఱన్ = అతిశయింపఁగా, కతిపయకాలమునకున్ = కొంతకాలమునకు.
  2. అభ్యస్తములు = అభ్యసింపఁబడినవి.
  3. చెలఁగఁగన్ = ప్రసిద్ధమగునట్లు.
  4. గీర్వాణ = దేవతలయొక్క, దేవారుల = దానవులయొక్క.
  5. భువిన్ = భూలోకమునందు, ముయ్యాఱు = పదునెనిమిది.
  6. ప్రభ వహించెన్ = ప్రకాశమును పొందెను.
  7. ఆయుర్వేదము = వైద్యశాస్త్రము, ఉపన్యసింపఁబడును = చెప్పఁబడును.