పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దంబున దురాచారంబు చేసిన మేనల్లునిం గోపంబు నిలువనోపక తన్నిన.[1]

80


ఆ.

బ్రహ్మహత్యతోడఁ బ్రతియైనయాపాప, మతనిఁ జెందె నప్పు డమ్మహాత్తుఁ
డిచ్ఛలోనఁ గలఁగి యింకఁ బ్రాయశ్చిత్త, కర్మ మెవ్విధమునఁ గలుగునొక్కొ.[2]

81


తే.

అని విచారించి శిష్యుల నపుడు పిల్చి, మీరలండఱు నను సంక్రమించినట్టి
పాప ముడుగంగ వ్రతము సద్భక్తితోడ, నాచరింపుఁడు నావుడు యాజ్ఞవల్కి.[3]

82


క.

గురువులఁ గనుఁగొని యే నీ, దురితముఁ బాపంగ నోవుదును వీరలు నా
సరిగారు నామహత్వం, బరయుము నాయంతవారలా యీవిప్రుల్.[4]

83


క.

అని యిట్లు గురువుసన్నిధి, దనగర్వము మెఱసి విప్రతతులను నిందిం
చిన నావైశంపాయన, ముని మండుచు యాజ్ఞవల్క్యముని కిట్లనియెన్.[5]

84


తే.

ఓరి నాముందఱనె మొగమోటలేక, నీవు గర్వించి బ్రాహ్మణనింద చేసి
తిది మహాపాతకముగాన నింక నిన్ను, నొల్ల నినుఁ జూచినను గోప ముడుపలేను.[6]

85


వ.

కావున నీవు నావలన నేర్చిన వేదంబు మరలం గ్రక్కి పొమ్మనిన.

86


చ.

అనఘుఁడు యాజ్ఞవల్కి గురునం ఘ్రులకున్ బ్రణమిల్లి నామదిన్
ననిచినభక్తితోఁ బలికినాఁడను గర్వములేదు దుష్టుగా
ననుటయు నంతకంత కతఁ డాడినమాటయె యాడుఁగాని శి
ష్యునిఁ బరనూనురాగమునఁ జూడఁడు కోపభరంబుపెంపునన్.[7]

87


వ.

యాజ్ఞవల్కియు ననేకప్రకారంబులం బ్రార్థించి యతనివలన మెత్తఁబాటుగానక
మున్ను తననేర్చినవేదంబులు రుధిరరూపంబుగా ఛర్దిచేసి యెందుకడకుం బోయి
గురువు బ్రహ్మహత్య వాయునుపాయంబు లైనవ్రతంబులు సేయుచుండె నంత.[8]

88


క.

అత్తపసి యిట్లు గ్రక్కిన, నెత్తురుమాంసములు నైననిఖిలశ్రుతులున్
దిత్తిరిపక్షులు మ్రింగినఁ, దిత్తిరు లనుశాఖలయ్యె ధృతి నెల్లెడలన్.

89


ఆ.

అంత యాజ్ఞవల్కి యాచార్యుదోషంబుఁ, బాపి గురువుమీఁదిభక్తిఁ జేసి
దోషరహితబుద్ధితోడఁ బ్రాణాయామ, మహితుఁడై తపస్సమాధివలన.

90


వ.

సకలవేదమయుం డైనసూర్యదేవుని నారాధించుచుండె నంత.

91


తే.

వాజిరూపంబుతో వచ్చి వనజహితుఁడు, యాజ్ఞవల్కికిఁ బ్రత్యక్షమై వరంబు
వేఁడు మనుటయు భక్తిని వినుతి చేసి, బహువిధంబుల వినుతించి పల్కె నతఁడు.[9]

92


తే.

అనఘ నాగురుఁ డెఱుఁగనియతిరహస్య, మగుయజుర్వేద మిపుడు నే నభ్యసింప

  1. ప్రల్లదంబునన్ = ముష్కరత్వముతో, దురాచారంబు = చెడ్డనడత.
  2. కలఁగి = కలఁత నొంది.
  3. సంక్రమించినట్టి = పొందిన, ఉడుగంగన్ =అణఁగ - పోవ.
  4. దురితము = పాపము.
  5. మండుచున్ = కోపవికారమును జూపుచు.
  6. మొగమోట = దాక్షిణ్యము.
  7. ననిచిన = అతిశయించిన, కోపభరము = కోపముయొక్క అతిశయము.
  8. మెత్తఁబాటు = మృదుత్వము - దయ కలిగినతనము, రుధిరరూపంబుగాన్ = నెత్తురుగా, ఛర్ది చేసి = క్రక్కి.
  9. వాజి = గుఱ్ఱము, వనజహితుఁడు = సూర్యుఁడు.