పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

వేదక్ష్మారుహమూలకంద మసకృద్విజ్ఞానభానుప్రభా
ఛ్ఛాదీభూతమహోగ్రపాతకతమశ్ఛాదంబు నానారస
ప్రాదుర్భూతమహాకవిత్వరచనాపారీణుఁ డైనట్టియా
వేదవ్యాసమునీశ్వరుండు వెలసెన్ విష్ణుప్రభావంబునన్.

72


వ.

అట్టివేదవ్యాసుం డైనకృష్ణద్వైపాయనుండు బ్రహ్మచేత నియుక్తుండై వేదంబులు
నాలుగుపాదంబులుగాఁ జతుర్భేదంబుఁ జేసి యందు ఋగ్వేదంబు పైలుండును
యజుర్వేదంబు వైశంపాయనుండును సామవేదంబు జైమినియు నధర్వవేదంబు
సుమంతుండును పురాణేతిహాసంబులు రోమహర్షణపుత్రుం డగుసూతుండునుం
జదువునట్లుగా నియమించె వారలందఱు దమతమ శిష్యప్రశిష్యసంతతులచేతం
జదివించిన వారివారిపేర శాఖాసహస్రంబు లయ్యె నెట్లనిన.

73


క.

పైలుఁడు ఋగ్వేదము గుణ, శీలురు బోధాయనాదిశిష్యవరులచే
నాలోడింపఁగఁ జేసె వి, శాలగతిన్ బహుసహస్రశాఖలు గల్గన్.[1]

74


క.

ధీయుతమతి యగువైశం, పాయనుఁ డాత్మీయవేదపాఠంబునకున్
భూయిష్ఠమహిమ నధికుం, డై యిరువదియేడుశాఖ లమరఁగఁ జేసెన్.

75


తే.

చేసి యాశాఖలన్నియు శిష్యవరుల, చేతఁ జదివించె వారు విశేషమహిమ
దనర శిష్యప్రశిష్యసంతతులవలనఁ, బెక్కుశాఖలు గావించి రక్కజముగ.[2]

76


వ.

అట్టి వైశంపాయనశిష్యులలోన.

77


ఉ.

పుణ్యుఁడు బ్రహ్మరాతమునిపుత్రుఁ డుదంచితవేదపాదపా
రణ్యవిహారసింహుఁడు విరాజితభూరితపోమయుండు బ్ర
హ్మణ్యుఁడు యాజ్ఞవల్కి యనుమౌని గురున్ భజియించి వానికా
రుణ్యకటాక్షవీక్షణపరుం డగుచున్ విలసిల్లెఁ బెంపుతోన్.[3]

78


ఉ.

అమ్ముని యొక్కనాఁడు పరమార్థరహస్యము లైనవేదవా
దమ్ములు చేయుచున్ మునికదంబము లెల్ల వినంగ సప్తరా
త్రమ్ములలోన మద్గురుఁడు బ్రాహ్మణహత్య యొనర్చునట్టిపా
పము హరింప నోపుపరిపాటిమహత్వము గల్గు నాయెడన్.[4]

79


వ.

అని యిట్లు యాజ్ఞవల్కి పల్కినవచనంబులు శిష్యులవలన విని వైశంపాయనుం
డతనిమీఁదం గోపించియుఁ దనయం దతండు పరమభక్తుండు గావున నొండే
మియు ననక యెప్పటియట్ల వేదంబులు చెప్పుచుండి తనయాజ్ఞలో నడవక ప్రల్ల

  1. ఆలోడింపఁగన్ = విచారింప, విశాలగతిన్ = విశేషముగా ననుట.
  2. అక్కజముగన్ = ఆశ్చర్యముగా.
  3. వేదపాదపారణ్యవిహారసింహుఁడు = వేదముల నెడువృక్షములుగల అడవియందు విహరించుటయందు సింహమైనవాఁడు. వేదములన్నియు చక్కగా చదివినవాఁడు అనుట, విరాజితభూరితపోమయుండు = మిక్కిలి ప్రకాశించునట్టి అధికతపస్సే స్వరూపముగాఁగలవాఁడు, బ్రహ్మణ్యుఁడు = వేదవిహితమైన యాచారము నడపువాఁడు, పెంపుతోన్=గౌరవముతో.
  4. కదంబములు = సమూహములు, పరిపాటి = అనుసరించునది - అంతమాత్రము అనుట.