పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

శనైశ్చరుండును సంస్తుతియును వహ్నితేజుండును వపుష్మంతుండును ననుజ్జ్వ
లుండును జ్వలనుండును ననుభవ్యమూర్తులు సప్తసంయములు సర్వత్రగసుధ
ర్మదేవానీకాదులు విష్ణుసావర్ణినందనులు గాఁగలవారు మఱియును.

49


తే.

రుద్రసావర్ణి యనువాఁడు రుద్రసుతుఁడు, ద్వాదశాంతరమనువు తద్రాజ్యమునను
దైవతప్రభుఁడై ఋతుధాముఁ డుండు, హరితరోహితదేవాదు లమరవరులు.

50


వ.

తపస్వియును దపోమయుండును దపోమూర్తియుఁ దపోరతియును దపోధృతి
యును దపోధనుండును ద్యుతిమంతుండును ననువారు సప్తమహర్షులు దేవోప
దేవదేవశ్రేష్ఠాదు లైనరాజులు మనుపుత్రులు గాఁగలవారలు.

51


సీ.

మఱి పదుమూడవమనువు రౌచ్యుం డనునవనీశ్వరుఁడు వానియంతరమున
సుగ్రాముఁ డనువాఁడు సురలోకనాథుండు ధర్మసుధర్మసుకర్మముఖులు
ముప్పదిమువ్వురై యొప్పారెదరు సురగణములు నిర్మోహకప్రదర్శ
నిష్ప్రకంపావ్యయనిత్యనిరుత్సుకహితమతు లనుమును లేడుగురును


తే.

సప్తసంయము లాదిత్యసవనచిత్ర, చిత్రసేనవిచిత్రాదిధాత్రిపతులు
మనుతనూభవులై మహీమండలంబు, తమభుజాశక్తిఁ బాలించెదరు మునీంద్ర.

52


వ.

పదునాలవమన్వంతరంబున శుచి యనువాఁడు దేవేంద్రుండు గాఁగలవాఁడు.
చాక్షుషసావిత్రకనిష్ఠవాచావృద్ధాదులు దేవగణంబు లయ్యెదరు. అగ్నిబాహుం
డును శుచిచిత్తుండును శుక్రుండును మాగధుండును నగ్నిరథుండును యుక్తుం
డును నజితుండును ననువారు సప్తమహర్షు లయ్యెదరు. గురుగంభీరముఖ్యా
దులు మనుతనూభవు లయ్యెదరు.

53


క.

ఈమనువులు నీయింద్రులు, నీమౌనులు నీనృపతులు నీదేవతలు
శ్రీమహిళావల్లభుతే, జోమండితు లైరి పద్మజునిదివసమునన్.[1]

54


చ.

వినుము చతుర్యుగాంతమున వేదము లన్నియు విప్లవంబు లై
చనిన మహీతలంబునకు సప్తమునీంద్రులు నేగుదెంచి పెం
పున బహువేదశాస్త్రములు మున్నిటియట్ల ప్రతిష్ఠ చేసి రూ
ఢిని నొనరించుచుండుదురు డెబ్బదియొక్కమహాయుగంబునన్.[2]

55


క.

స్మృతులు ప్రతిష్ఠింతురు ప్రతి, కృతయుగముల మనువు లవనిఁ గీర్తులు వెలయన్
క్షితి పాలింపుడు రమ్మను, సుతులు దివిజవరులు క్రతుభుజులుఁ బెం పెసఁగన్.[3]

56


క.

మనువులు మనుపుత్రులు న, య్యనిమిషులును సప్తఋషులు నమరాధిపులున్
విను మాయామన్వంతర, మున కధికారులు జగంబుఁ బోషింపంగన్.

57
  1. శ్రీమహిళావల్లభుతేజోమండితులు = శ్రీవిష్ణునియొక్క తేజస్సుచేత అలంకరింపఁబడినవారు, పద్మజునిదివసమునన్ = బ్రహ్మదినమునందు.
  2. విప్లవంబులు = ప్రళయమును పొందినవి - చెడినది, ప్రతిష్ఠ చేసి = నిలిపి.
  3. క్రతుభుజులు = దేవతలు.