పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

అనినం బంకజబాంధవుం డపుడు ఛాయాదేవి నీక్షించి యో
వనితా యెవ్వతె వీవు దండధరుఁ దీవ్రక్రోధవృత్తిన్ శపిం
ప నిమిత్తం బది యేమి నీవలనఁ గాపట్యంబు గాన్పించె నం
దనుపై నిర్దయకర్మముల్ చనునె కొంతా యింత గావింతురే.

34


క.

నీవలన మిగులఁ గపటపు, భావంబులు పెక్కు గానఁబడుచున్నవి కాం
తా వెరవవలదు నాయెడ, నీ వెవ్వర వింతయలుక నీ కేమిటికిన్.

35


క.

నిక్కము చెప్పుము చెప్పక తక్కిన ని న్నిపుడు పెట్టి దండింతు ననన్
స్రుక్కి దివాకరుఁ గనుఁగొని, యక్కమలదళాక్షి కడురయంబునఁ బల్కెన్.[1]

36


తే.

అబ్జబాంధవ నీభార్య యైనసంజ్ఞ, గాను నాపేరు ఛాయను గమలవదన
నిన్ను డాయంగ శంకించి నన్ను నునిచి, తా నరణ్యంబునకుఁ బోయెఁ దపము సేయ.

37


వ.

అనినం గర్మసాక్షి యాతామరసాక్షి నొండేమియుం బలుకక ధర్మరాజుపాదం
బులు పూర్వప్రకారంబున నుండునట్లుగా ననుగ్రహించి వాజిరూపంబున
నున్న సంజ్ఞానివాసంబు ఛాయాదేవివలన నెఱింగి యచ్చోటికిం జని తాను
నశ్వరూపంబు ధరియించి యయ్యింతితోడం గ్రీడించెఁ దత్సమాగమంబువలన
నశ్వినీదేవతలును రేవంతుండునుఁ బుట్టిరి ఇట్లు భార్యాసమేతుండై నిజనివా
సంబునకు వచ్చి సుఖంబుండె నంత.[2]

38


తే.

తృష్ట చనుదెంచి లోకబాంధవునిఁ గాంచి, దేవి సంజ్ఞవిధం బెల్లఁ దెలియఁ జెప్పి
యతనితీవ్రమయూఖసహస్రకమున, నెనిమిదవపాలు కరసానఁ దునియఁబట్టె.[3]

39


తే.

చండకిరణంబు లీరీతి సానఁబట్టి, కొంతకాంతంబు గావించి కూఁతుఁ దెచ్చి
యల్లునికిఁ బ్రియమారంగ నప్పగించె, వివిధశిల్పకళాకర్మ విశ్వకర్మ.[4]

40


వ.

ఇట్లు సూర్యకిరణంబులవలన రాలినరజంబు శంకరునకుఁ ద్రిశూలంబును, విష్ణు
నకుఁ జక్రంబును, కుబేరునకు ఖడ్గంబును, కుమారునకు శక్తియును, మఱియు
నానాదేవతలకు ననేకదివ్యాయుధంబులుం జేసె నిట్లు వైష్ణవతేజంబు పెక్కు
విధంబులఁ బ్రవరిల్లుచుండె నంత.[5]

41
  1. స్రుక్కి = సంకోచించి (లేక) వెఱచి.
  2. ఒండు = ఇతరము, తత్సమాగమంబునన్ = ఆకూడికచేత.
  3. తీవ్రమయూఖసహస్రకమునన్ = తీక్ణములైన వేయికిరణములయందు, కరసానన్ = కత్తులకు పదును పెట్టెడు చక్రాకారమైన సానయందు.
  4. చండకిరణంబులు = వేండ్రమైనకిరణములు, శాంతము =వేండ్రము లేనిది.
  5. రజము= పొడి, త్రిశూలము=మూఁడుమొనలు గలశూలము.