పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

కమలహితుఁడు విశ్వకర్మతనూభవ, యైనసంజ్ఞ యనుమృగాక్షిఁ బెండ్లి
యాడి దానివలన నత్యంతసుఖలీలఁ, దేలుచుండి కొంతకాలమునకు.

23


క.

మనువును యముఁడును యమునయు, ననువారల మగుడఁ బడసె నాసతివలనన్
వనరుహబాంధవుఁ డెంతయు, ననురాగరసాబ్ది నోలలాడుచునుండెన్.

24


వ.

అంత నమ్మహాదేవియును సూర్యదేవునిచండకిరణంబులు డాయ నోపక వృద్ధ
పరిగ్రహ యైనయువతిచందంబున నిజచ్ఛాయకుం దనయట్ల శరీరంబు గల్పించి
పతిశుశ్రూష సేయ సమకట్టి పెట్టి యరణ్యమధ్యంబునకుం జని వాజిరూపంబు ధరి
యించి యజ్ఞాతవాసంబునఁ దపంబు సేయుచుండె నంత.[1]

25


ఉ.

ఛాయయు సంజ్ఞయట్ల జలజప్రియసేవ యొనర్చుచుండ నా
తోయజభాంధవుండు తనతొయ్యలియట్ల మనోనురాగముల్
సేయఁగ నుండె సంజ్ఞ మును చేసినసేఁత లెఱుంగ కిమ్మెయిన్
మాయలు పన్నుభామినుల మంచితనంబులు నమ్మవచ్చునే.[2]

26


వ.

ఇట్లు కపటరూపసేవావిధేయ యైనఛాయయందు మనువును శనైశ్చరుండును
దపతియు జన్మించి పెరుగుచున్న యప్పుడు.

27


తే.

ఛాయ నిజపుత్రకులయట్ల సవతిసుతుల, గౌరవంబునఁ జూడక కడునుపేక్ష
సేయుచుండంగ యముఁడు వీక్షించి కోప, మాత్మఁ బెనఁగొనఁ బినతల్లి కనియె నపుడు.

28


ఆ.

తల్లివయ్యు నీవు తనయుల నందఱ, నొక్కభంగిఁ జూడకుండు టెట్టు
లిట్టిబుద్ధి నీకు నేటికిఁ బాటిల్లె, ననిన నతనిమీఁద నాగ్రహించి.

29


క.

మానక విన నర్హంబులు, గానియుదాసీనవచనఘనకంటకముల్
వీనులలో నాటించిన, నానలినదళాక్షిఁ దన్నె నాతఁడు కిన్కన్.[3]

30


వ.

ఇ ట్లవమానంబుఁ బొంది యమ్మానవతి యతనిచరణంబులు భంగంబు లగునట్లుగా
శపియించె నప్పుడు సూర్యుం డది యేమి కారణం బని యడిగిన యముం
డిట్లనియె.

31


ఉ.

అన్నలు దమ్ము లైనమము నందఱ నొక్కవిధంబునం గృపన్
మన్నన సేయవేల యనినన్ నను నూరకతిట్టెఁ దిట్టినం
దన్నితిఁ దన్నినం దనపదంబులు గూల శపించె నిట్టికో
పోన్నతబుద్ధి తల్లులకు యుక్తమె పుత్రకులన్ శపింతురే.

32


ఆ.

తల్లియైన నేల తన్నుదు సుతుఁడైన, నేల నను శపించు నీమృగాక్షి
యేను గాను సుతుఁడ నీయమ తల్లియుఁ, గాదు చిత్తగింపు కర్మసాక్షి.

33
  1. చండ = వేండ్రమైన, డాయన్ = సమీపింప, వృద్ధపరిగ్రహ = ముసలినానిఁ జేపట్టినది, వాజి = గుఱ్ఱము.
  2. తొయ్యలి = ఆఁడుది - భార్య.
  3. ఉదాసీనవచనఘనకంటకములు = ఉచ్చరింపరాని మాటలనెడి గొప్పముండ్లు, కిన్కన్ = కోపముతో.