పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వనజబాంధవసుతుఁడు వైవస్వతాఖ్యుఁ, డందు దేవేంద్రుఁ డయ్యె పురందరుండు.[1]

15


సీ.

ఆదిత్యవసురుద్రు లమరగణంబులు గౌతమజమదగ్నికశ్యపాత్రి
మునులు భరద్వాజుఁడును వసిష్ఠుండు విశ్వామిత్రుఁడును నాఁగ సప్తమౌను
లిక్ష్వాకునాభాగధృష్టవరిష్యంతశర్యాతివృషదాదిజనపతులును
మహనీయమతులు తొమ్మండు వైవస్వతమనుకుమారులు జగన్మాన్యయశులు


తే.

వారలెల్లను వేర్వేఱ వంశకర్త, లై తురంగమమేధాదు లైనయాగ
ములు సమగ్రంబుగాఁ జేసి యలఘుబాహు, శక్తిఁ బాలించి రిమ్మహీచక్ర మెల్ల.[2]

16


క.

అగణితము నప్రమేయము, నగువిష్ణునిశక్తి యాచరాచరసహితం,
బగుమన్వంతరములతో, జగములు రక్షించుచుండు సాత్వికయుక్తిన్.[3]

17


క.

తోయజనాభునియంశము, లాయామన్వంతరముల నవతారములై,
ధీయుక్తి నెల్లజగములఁ, బాయక రక్షించుచుండుఁ బరమప్రీతిన్.[4]

18


వ.

అది యెట్లనిన స్వాయంభువమున్వంతరంబున నాకూతిదేవికి యజ్ఞుం డన మానస
పుత్రుండై పుట్టె, స్వారోచిషమన్వంతరంబునం దుషితాదేవికిఁ దుషితాదిదేవ
గణంబులతోడఁ దుషితుండై పుట్టె, ఉత్తమమన్వంతరంబున సత్యాదేవికి
సత్యాదిదేవగణంబులతోడ సత్యుండై జన్మించె, తామసమన్వంతరంబుర హర్య
యనుదానికి హరిప్రముఖదేవగణంబులతోడ హరిమూర్తియై పుట్టె, రైవతమ
న్వంతరంబున సంభూతికి రైవతు లనుదేవగణంబులతోడ సంభూతుండై పుట్టె,
చాక్షుషమన్వంతరంబున వికుంఠాదేవికి వైకుంఠాదిదేవగణంబులతోడ వైకుం
ఠుండై జన్మించె, వైవస్వతమన్వంతరంబునఁ గశ్యపప్రజాపతికి నదితియందు
నాదిత్యాదిదేవగణంబులతోడ వామనుండై పుట్టి త్రివిక్రమంబునం ద్రిలోకంబు
లాక్రమించి నిహతకంటకం బైనత్రిలోకంబును పురందరునకు నొసంగె, ఇట్లు
సప్తావతారాదివిహారంబులవలన సమస్తలోకంబులుం దాన యై విష్ణుండు ప్రతి
పాలించును.

19


ఆ.

ఇవ్విధముననైన నీవిశ్వమున నమ్మ, హాత్ముశక్తి విష్ట మగుటఁ జేసి
విష్ణునామ మయ్యె విశధాతువు ప్రవేశ, నార్థయుక్తితోడ నమరుఁ గాన.[5]

20


చ.

అనిమిషసిద్ధసాధ్యులుఁ జరాచరభూతములు సుపర్వులున్
(?)మనువులు ఖేచరుల్ మనుకుమారులు లోనగు నీజగంబులె
ల్లను బహుసాత్వికస్ఫురణల వెలుఁగొందుచు నుండు నన్నియున్
వినుతకృపావిధేయుఁ డగువిష్ణువిభూతులుగా నెఱుంగుమీ.

21


వ.

అని చెప్పి వెండియు ననాగతమన్వంతరంబులు వినిపించువాఁడై యిట్లనియె.

22
  1. సాంప్రతము = వర్తమానము - ఇప్పడు జరుగునది, వనజబాంధవసుతుఁడు = సూర్యునికొడుకు.
  2. జగన్మాన్యయశులు = లోకమునందు గౌరవింపఁదగిన కీర్తిగలవారు.
  3. అగణితము = లెక్క పెట్టరానిది, అప్రమేయము = మేరలేనిది.
  4. తోయజనాభుని = విష్ణునియొక్క.
  5. విష్టము = ప్రవిష్టము.