పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

రాజసేనాసమ్మర్దంబులకు నోడి తెరువు దొలంగి కూర్చున్న వానిం బొడగాంచి నమ
స్కారంబు చేలీ ఋభుం డిట్లనియె.[1]

368


ఆ.

ఒంటినేల యిచట నున్నాఁడ వనిన నీ, బలము క్రందువలనఁ బథమునందు
నరుగ రాకపోయి యనపుడు వీరిలో, నెవ్వఁ డవనినాథుఁ డెద్ది బలము.[2]

369


క.

నీ వెఱుఁగుదు వని యడిగితి, నీవిధ మెఱిఁగింపు మనిన నేనుఁగుమీఁదన్
బోవఁగ నున్నాఁ డతఁడె మ, హీవిభుఁ డని చెప్పుటయును ఋభుఁ డాతనితోన్.

370


క.

అవనీపతి సింధురముల, వివరంబుగఁ జెప్పవైతి వీరు పృథగ్రూ
పవికారంబుల నున్నా, రు వారణం బెద్ది భూవరుం డెవ్వఁడొకో.[3]

371


వ.

అనిన నిదాఘుఁడు.

372


ఆ.

మీఁద నున్నవాఁడు మేదినీపతి క్రింద, నున్నయది గజంబు పిన్నబిడ్డ
యైన నెఱుఁగ నేర్చు ననినఁ గ్రిందును మీఁదుఁ, దెలియఁ జెప్పు మనిన నలిగి యతఁడు.

373


తే.

ఋభునిమెడ వంచి వీఁపుపై నెక్కి నేను, నృపునిగతి మీఁద నున్నాఁడ నీవు గంధ
నాగమునుబోలె క్రింద నున్నాఁడ వనిన, నానిదాఘునితో ఋభుం డనియె మఱియు.[4]

374


తే.

ఈవు నే ననునర్థంబు లెఱుఁగవలయు, జెప్పు మనుటయుఁ బరమార్థసిద్ధతత్త్వ
సోహ మనువాక్యములు రెండుఁ జూడ నేక, మైనయద్వైతవాసన యాతఁ డెఱిఁగి.

375


వ.

సత్వరంబుగా దిగనుఱికి నమస్కారంబు చేసి మహాత్మా మద్గురుండ వైనఋభుండ
వీవు కాకయున్నఁ దక్కినవారిచిత్తంబు లమ్మహాత్ముచందంబున నద్వైతవాసనా
సంస్కా రంబుచేత నావృతంబులు గావని వివేకించితి ననిన ఋభుం డతని కిట్లనియె.[5]

376


ఆ.

ఏను ఋభుఁడ నగుదు నీవు చేసినపూర్వ, సేవవలన మిగులఁ జిత్త మలరి
బ్రహ్మవిద్యఁ దేటపడ నుపదేశింప, వచ్చినాఁడ గౌరవంబు గదుర.

377


వ.

నీ కద్వైతవిజ్ఞానంబు గొఱంతలేదు సుఖివై యుండు పోయివచ్చెద నని
ఋభుం డరిగె నిదాఘుండును గురూపదేశమార్గంబున సమస్తభూతంబులఁ దన
యాత్మతోడ నభేదంబుగాఁ జూచుచు బ్రహ్మంబు నెఱింగి ముక్తుండయ్యె.

378
  1. సమ్మర్దంబునన్ = సందడికి (లేక) త్రొక్కడికి, తెరువు తొలంగి = దారి విడిచి.
  2. క్రందు = సందడి, పథమునందున్ = త్రోవను, ఆవనినాథుఁడు = రాజు, బలము = సేన.
  3. అవనీపతిసింధురములన్ = రాజును ఏనుఁగును, పృథగ్రూపవికారంబులన్ = వేఱువేఱురూపములవల్ల నైన మాఱుపడుటలచేత, వారణము = ఏనుఁగు.
  4. గంధనాగమునుబోలెన్ = మదపుటేనుఁగువలె.
  5. సత్వరంబుగాన్ = త్వరతో కూడుకొనునట్టుగా, వివేకించితిని = తెలిసికొంటిని.