పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

ఆత్మతత్త్వపురుషుఁ డాకసమునఁబోలె, నెందునైన నుండు నెల్ల ప్రొద్దు
కాన నేను రానుబో నొక్కచో నుండ, నివ్విధములు నీవే యెఱిఁగికొనుము.

359


తే.

నీవుఁ దక్కినవారలు నిర్ణయముగఁ, దత్త్వ మనువచనమునకుఁ దగురు సూవె
యేను దక్కినవారలు మౌనినాథ, సోహ మనుటకుఁ దగ మాత్మ నూహ నెఱుఁగ.

360


వ.

అన్నంబునం గలమృష్టామృష్టభేదంబులు నీవలన నెఱుంగువాఁడనై యడిగితి
మృష్టాన్నం బమృష్టంబును నమృష్టాన్నంబు మృష్టంబును నై శరీరంబున కనుద్వే
గోద్వేజనంబులు గావించుం గావున నన్నం బెప్పుడును రుచిగాదు.[1]

361


తే.

మృత్తికాగేహములు మంటిమెత్తడముల, దృఢము లగుగతిఁ బార్థివదేహచయము
పార్థివము లైనగోధూమఫలయవాఖ్య, పోష్యమాణంబులై దార్ఢ్యమునఁ జెలంగు.[2]

362


క.

ఊరక మృష్టామృష్టవి, చారంబులు మాని ముక్తి సంధిలుమార్గం
బారసి చిత్తముఁ బరత, త్త్వారూఢముఁ జేసి విడువు మైహికవిధులన్.

363


చ.

అనిన నిదాఘుఁ డాతనికి నంజలిచేసి మహాత్మ మీరు చె
ప్పినపరమార్థతత్త్వమున పెంపున నాహృదయంబులోనఁ గ
ల్గినయవివేకమంతయును గీటడఁగెన్ సుఖినైతి నీవిధం
బును నభిధానమున్ నిఖిలమున్ వినిపింపుము నాకు నావుడున్.[3]

364


ఉ.

ఏను ఋభుండ నీగురుఁడ నిధ్ధవివేకము నీకుఁ దెల్పఁగాఁ
బూనినవేడ్క వచ్చితి నపూర్వరహస్యము నీకుఁ జెప్పితిం
గానఁ బ్రపంచమంతయు జగత్పరిపూరితుఁ డైనయచ్యుతా
ధీనముఁ జేసి సుస్థిరగతి విలసిల్లుము పోయివచ్చెదన్.[4]

365


క.

అని చెప్పి యథేచ్ఛాగతిఁ, జని వెండియు వేయుదివ్యసంవత్సరముల్
చనఁగ నొకనాఁడు క్రమ్మఱః, జనుదెంచి తదీయనగరసామీప్యమునన్.

366


ఉ.

ఏనుఁగు నెక్కి యానగర మేలెడుభూరమణుండు సర్వసే
నానికరంబుతోడ సదనంబునకుం జనుచుండ నొక్కఁడున్
గ్లాని వహింపఁ బేరడవిఁ గాయలు బండ్లు సమిత్కుశాదులుం
దానె వహించి వచ్చుచు నిదాఘుఁడు తత్పురబాహ్యవీథులన్.[5]

367
  1. మృష్ణామృష్టభేదంబులు = స్వాధువు స్వాదువుకానిది అను భేదభావములు, అనుద్వేగోద్వేజనంబులు = వేదనలేమిని వేదనను, రుచి = ఇష్టము.
  2. మెత్తడములన్ = దట్టముగా పూయుటలచేత, పోష్యమాణంబులు = పోషింపఁబడుచున్నవి, దార్ఢ్యమునన్ = దృఢత్వముచేత, చెలంగున్ = అతిశయించును.
  3. గీటడఁగెన్ = నశించెను, అభిధానమున్ = పేరును.
  4. ఇద్ధవివేకము = ప్రకాశించుచున్న తెలివిని, జగత్పరిపూరితుఁడు = లోకమునం దెల్లయెడల నిండుకొన్నవాఁడు.
  5. భూరమణుండు = రాజు, నికరంబుతోడన్ = సమూహముతో, సదనంబునకున్ = ఇంటికి, ఒక్కఁడు = ఒక్కఁడే, గ్లాని = బడలిక, పేరడవిన్ = గొప్పయడవియందు.